రోడ్డుపై హిజ్రాల పూజలు.. ఎస్ఐ పనికి అంతా షాక్
X
ఆ రోడ్డుపై ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ ఎస్సై ఓ నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే దానిని అమలుచేశాడు. ఆ తర్వాత ఉన్నతాధికారులు అతడిని విధుల నుంచి తప్పించారు. ఈ ఘటన చెన్నైలో జరిగింది. చెన్నైలోని వనాగారం, మధురవాయల్ సమీపంలోని రహదారిపై ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఎస్‌ఐ పళని ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నాడు.
ఇవాళ ఉదయం ఒక హిజ్రాను పోలీస్ వాహనంలో అక్కడకు రప్పించాడు. ఎక్కువ ప్రమాదాలు జరిగే రోడ్డు ప్రాంతంలో పూజలు చేయించాడు. ఆ హిజ్రా గుమ్మడికాయ, నిమ్మకాయలతో ఆ రోడ్డుకు దిష్టి తీసింది. అనంతరం వాటిని నేలకేసి కొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో వారు సదరు ఎస్సైపై తగిన చర్యలు తీసుకున్నారు.
ట్రాఫిక్ ఎస్‌ఐ పళనిని ఆ విధుల నుంచి తప్పించడంతోపాటు కంట్రోల్ రూమ్‌కు రిపోర్ట్ చేయాలని ఆదేశించినట్లు ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ కపిల్ కుమార్ శరత్కర్ తెలిపారు. ‘‘పోలీస్ అయి ఉండి తన వృత్తికి వ్యతిరేకంగా వ్యవహరించాడు. తన వ్యక్తిగత నమ్మకంతో అలా రోడ్డుపై పూజలు చేయడం కరెక్ట్ కాదు. రోడ్డు ప్రమాదాలకు దారితీసే కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించి నివారణకు చర్యలు చేపట్టాలి. దుష్టశక్తిని తరిమే పేరుతో ఇలాంటి పూజలు చేయడం సరికాదు’’ అని అన్నారు.
Cops break pumpkin on Chennai road to ward off evil; SI booted outhttps://t.co/Rl3XEZHFOf pic.twitter.com/dBDmoKqq4W
— TOIChennai (@TOIChennai) June 10, 2023