తాగుబోతు ఎలుక అరెస్ట్.. తప్పించుకున్న వాటి కోసం వేట
X
దొంగలనే కాదు కోళ్లను, బర్రెలను, చిలుకలను కూడా అరెస్ట్ చేయడం మనకు తెలుసు. మనుషులు పెట్టుకునే గొడవ వల్ల అమాయక జీవులు కటకటాల పాలవుతుంటాయి. మనుషులు చెప్పే కథలే అర్థం కాక, ఎప్పుడు వదిలేస్తార్రా దేవుడా అని మొత్తుకుంటూ ఉంటాయి. తాజాగా ఓ ఎలుకకు అలాంటి పరిస్థితే ఎదురైంది. జప్తు చేసిన మద్యాన్ని తాగేసి దారుణమైన నేరం చేసిందంటూ పోలీసులు దాన్ని బోనులో బంధించిన కోర్టు బోనులో ఉంచారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా పట్టణంలోని కొత్వాలీలో ఈ వింత అరెస్ట్ జరిగింది.
పోలీసులు తెలిపిన ‘కథ’నం ప్రకారం.. ఇటీవల పోలీసులు ఓ వ్యక్తి నుంచి 60 సీసాల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోలీస్ స్టేషన్లో ఉంచారు. కేసు విచారణలో భాగంగా వాటిని కోర్టు ముందు ఉంచాల్సి వచ్చింది. కోర్టుకు వెళ్లే ముందుకు సీసాలను పరిశీలించగా అన్నీ ఖాళీగా కనిపించాయి. స్టేషన్‌లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవే మందు కొట్టాయని నిర్ధారించారు. అవి బాగా తాగి మత్తుగా నిద్రపోయాయని చెప్పారు. ఎన్ని చెప్పినా కోర్టుకు ఆధారాలు చూపాలి కాబట్టి బోను పెట్టి ఓ ఎలుకను పట్టుకుని కోర్టుకు హాజరుపరిచాయి. మిగతా తాగుబోతు ఎలుకలు తప్పించుకున్నాయని, వాటిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు. చింద్వారాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో, ప్రభుత్వ భవనాల్లో ఎలుకల బెడద తీవ్రంగా ఉందని పోలీసులు చెప్పుకొచ్చారు. కొన్ని డాక్యుమెంట్లను ఎలుకలను తినేస్తున్నాయని, శవాలను కొరుక్కుతింటున్నాయని వాపోయారు.