Home > వైరల్ > పొలంలో దొరికిన అరుదైన వజ్రం.. రైతు కష్టాలు తీరాయనుకుంటే.. ట్విస్ట్!!

పొలంలో దొరికిన అరుదైన వజ్రం.. రైతు కష్టాలు తీరాయనుకుంటే.. ట్విస్ట్!!

పొలంలో దొరికిన అరుదైన వజ్రం.. రైతు కష్టాలు తీరాయనుకుంటే.. ట్విస్ట్!!
X

తొలకరి వానల తర్వాత అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వజ్రాల వేట ప్రారంభమవుతుందన్న సంగతి తెలిసిందే. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పలువురు రైతులు, కూలీలే కాకుండా.. ఎక్కడెక్కడి నుంచో ఆశావాహులు వచ్చి వజ్రాల కోసం అణువణువు గాలిస్తుంటారు. ఆఖరులో కొందరికి మట్టిచేతులే మిగిలగా.. మరికొందరికి మాత్రం ఆ చేతుల్లో మాణిక్యాలు కూడా దర్శనమిస్తాయి. ఆ వజ్రాలను వ్యాపారులకు అమ్మి కోటీశ్వరులు, లక్షాధికారులైన రైతులూ ఉన్నారు. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు మాత్రం.. తనకు దొరికిన వజ్రాన్ని వ్యాపారికి అమ్మి చిక్కుల్లో పడ్డాడు. వజ్రాన్ని కొనుగోలు చేసి వ్యాపారి రైతుకు చాలా తక్కువ మొత్తాన్ని చెల్లించారని.. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆర్డీవో, తహసీల్దార్‌‌కు ఫిర్యాదు చేశాడు ఆ రైతు.

వివరాలిలా.. గుంతకల్లు మండలం శంకరబండికి చెందిన ఓ రైతుకు మూడు రోజుల కిందట పొలంలో వజ్రం దొరకింది. వెంటనే ఆ వజ్రాన్ని కర్నూలు జిల్లా పెరవలి గ్రామంలోని వజ్రాల వ్యాపారికి రూ.9.50 లక్షలకు విక్రయించాడు. ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో వ్యాపారి రైతు నుంచి మంచి వజ్రాన్ని తీసుకుని తక్కువ మొత్తం ఇచ్చాడని అధికారులకు ఫిర్యాదు చేశారు. తన వజ్రానికి ఎక్కువ మొత్తాన్ని ఇవ్వాలని సంబంధిత రైతు వ్యాపారిని అడగగా.. అతడు నిరాకరించడంతో ఈ వ్యవహారం బయటపడింది. వజ్రం రూ.9.50 లక్షల కంటే ఎక్కువ ఖరీదు ఉండదనీ.. తన డబ్బు వాపసు ఇచ్చి వజ్రాన్ని తీసుకుపోవాలని వ్యాపారి రైతుకు తెలియజేశారని గ్రామస్థులు చెప్పారు. ఈ విషయంలో రైతును మోసగించిన వ్యాపారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ అంశంపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు గ్రామస్థులకు హామీ ఇచ్చారు. వజ్రానికి తక్కువ ధర చెల్లించారని వ్యాపారిపై ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అయ్యింది.


Updated : 21 Sep 2023 6:36 AM GMT
Tags:    
Next Story
Share it
Top