బర్త్ డే కానుకగా నాలుగు కేజీల టమాటాలు
X
చాలా సాధారణంగా వంటింట్లో పడి ఉండే టమాటా ఈరోజు బంగారం సింహాసనం ఎక్కి కూర్చుంది. వార్తల్లో రారాజుగా నిలుస్తోంది. తాజాగా ఒక మహిళకు బర్త్ డే కానుకగా నాలుగు కేజీల టమాటలు ఇచ్చారనే వార్త, దానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతున్నాయి.
కొండెక్కిన టమాటా ధరల గురించి రోజుకో వింత వార్త బయటకు వస్తూనే ఉంది. టమాటా వ్యాపారి బౌన్సర్లను పెట్టుకోవడం, దొంగతనాలు, మొబైల్ కొంటే టమాటాలు ఉచితం....ఇలా ఏదొక వింత చేస్తూనే ఉన్నారు జనాలు. ఇక టమాటా ధరల గురించి వచ్చే మీమ్స్ కి అయితే లెక్కే లేదు. ఒకపక్క విపరీతంగా పెరిగిన టమాటాలను కొనలేక అవస్థలు పడుతూనే వాటి గురించి జోకులు చెప్పుకుంటున్నారు, మీమ్స్ తయారు చేస్తున్నారు.
టమాటాల ధర ప్రస్తుతానికి భారతదేశం అంతటా చాలా ఎక్కువగానే ఉంది. సాధారణంగా కేజీ 30 రూ. కి మించని వీటి ధర 100 నుంచి 250 వరకూ వెళ్ళింది. ప్రదేశాన్ని బట్టి ధరల్లో తేడాలు ఉన్నాయి. మహారాష్ట్రలో కేజీ టమాటా ధర 140రూ. అందుకే అక్కడ ఓ మహిళ పుట్టిన రోజుకి ఆమె బంధువులు నాలుగు కేజీల టమాటాలు గిఫ్ట్ గా ఇచ్చారు. టమాటాల్లానే ఆకాశమంత ఎత్తు ఎదగాలని దీవించారుట కూడా. మహారాష్ట్రలోని కల్యాణ్ పట్టణంలోని కొచాడి ప్రాంతంలో నివసిస్తున్న సొనాల్ బోర్సే నే టమాటాలు అందుకున్న మహిళ. తనకు కానుకగా వచ్చిన టమాటాలను చుట్టూ పెట్టుకుని మరీ ఆమె తన బర్త్ డే కేక్ ను కట్ చేసింది. తన సోదరుడు, బంధువులు ఇచ్చిన ఈ బహుమతి తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని చెబుతోంది సొనాల్. సోషల్ మీడియాలో ఈ బర్త్ డేకి సంబంధించన వీడియే వైరల్ అవుతోంది.