విందులో కుర్చీ కోసం కొట్లాట.. అన్నదమ్ముళ్లపై పోలీసుల దాడి
X
ఓ వస్త్రాలంకరణ వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన విందులో కుర్చీ విషయమై మాటామాటా పెరిగి పెద్దగొడవకు దారితీసింది. ఆ కార్యక్రమానికి హాజరైన పోలీసులు ఇద్దరు అన్నదమ్ముళ్లపై దాడి చేశారు. తాము పోలీసు అధికారులం అనే విషయమే మర్చిపోయి.. ఆ ఇద్దరినీ చితకబాదారు. ఈ ఘటనలో ఆ అన్నదమ్ములు ఇద్దరికీ స్వల్పంగా గాయాలయ్యాయి. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఆదివారం (అక్టోబర్ 22) ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా గన్నవరం పట్టణంలోని గౌడపేటలో వస్త్రాలంకరణ కార్యక్రమంలో విందు ఏర్పాటు చేశారు. అక్కడికి స్థానికులు పామర్తి శ్రీకాంత్, చిన్నారావు అనే ఇద్దరు వ్యక్తులు కూడా హాజరయ్యారు. విందు వద్ద కుర్చీ విషయమై వీరిరువురికి మాటామాటా పెరిగింది. దీంతో ఒకరినొకరు వాదులాడుకున్నారు. అనంతరం పరస్పరం దాడికి దిగారు. వీరిలో చిన్నారావు స్థానిక పోలీస్ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అదే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోన్న మరొక సిబ్బంది తోడల్లుడు ఫంక్షన్ అది. దీంతో చిన్నారావుతో పాటు మరికొందరు పోలీసు సిబ్బంది యూనీఫాంలో కాకుండా సాధారణ దుస్తుల్లో అక్కడే భోజనానికి వచ్చారు.
అక్కడ గొడవ ముదరడంతో శ్రీకాంత్ సోదరుడు వెంకటేష్ అక్కడికి వచ్చి వారికి సర్దిచెబుతున్నాడు. ఇంతలో చిన్నారావు గొడవ పడటం చూసిన తోటి పోలీసు సిబ్బంది అందరూ శ్రీకాంత్‌తో పాటు అతని సోదరుడు వెంకటేష్‌పై దాడి చేసి చితకబాదారు. దీంతో ఈ విషయం కాస్తా స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ దాడిలో శ్రీకాంత్, వెంకటేష్‌కు స్వల్ప గాయాలవ్వగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శ్రీకాంత్ సోదరుడు వెంకటేష్ పట్ల హెడ్‌కానిస్టేబుల్ చక్రవర్తి ప్రవర్తించిన తీరు పోలీసు శాఖకే అమానకరంమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు మీడియాకు తెలిపారు.