ప్రియుడిపై అలిగి.. హైటెన్షన్ టవర్ ఎక్కిన బాలిక.. వీడియో
X
ప్రియుడి మీద అలిగితే... ఏదైనా కొనిచ్చే వరకూ లేదంటే బుజ్జగించే వరకూ లేని కోపాన్ని ప్రదర్శిస్తుంటారు సాధారణ అమ్మాయిలు. బుంగమూతి పెట్టుకొని బెట్టు చేస్తుంటారు. ఛత్తీస్‌గఢ్ ( Chhattisgarh) రాష్ట్రం.. మార్వాహి జిల్లాకి చెందిన ఓ బాలిక మాత్రం.. అందుకు ప్రత్యేకం. ప్రియుడితో గొడవపడి, అతడిపై కోపంతో ఏకంగా 80 అడుగుల విద్యుత్ టవర్ ఎక్కేసింది.
జిల్లాలోని గౌరెల పెండ్రా గ్రామానికి చెందిన ఓ బాలిక అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని కొన్నాళ్లుగా ప్రేమిస్తోంది. ఈ క్రమంలో అతడితో ఫోన్లో గొడవ పడింది. దీంతో కోపంతో 80 అడుగుల ఎత్తున్న హైటెన్షన్ విద్యుత్ టవర్ పైకి ఎక్కింది. ఆమెను బుజ్జగించేందుకు అతడు కూడా టవర్ పైకి ఎక్కాల్సి వచ్చింది. స్థానికులు ఈ విషయం గమనించి.. టవర్ చుట్టూ చేరి వారిని కిందకి దిగమని ప్రాధేయపడ్డారు. పోలీసులకు, వారి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎంత నచ్చజెప్పినా వారు మాత్రం కిందకు దిగలేదు. స్థానికుల్లో ఒకరు ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కొన్ని గంటల పాటు ఉద్రిక్త పరిస్థితుల తర్వాత.. వారంతట వారే సురక్షితంగా కిందకు దిగారు. ఈ ఘటనపై అధికారులు ఎలాంటి అధికారిక కేసు నమోదు చేయనప్పటికీ, మళ్లీ ఇలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు వారిని మందలించి వదిలేశారు.