Home > వైరల్ > ఫేక్ స్క్రీన్ షాట్ చూపించి రూ.2లక్షల గోల్డ్ కొట్టేసిన కేటుగాడు

ఫేక్ స్క్రీన్ షాట్ చూపించి రూ.2లక్షల గోల్డ్ కొట్టేసిన కేటుగాడు

ఫేక్ స్క్రీన్ షాట్ చూపించి రూ.2లక్షల గోల్డ్ కొట్టేసిన కేటుగాడు
X

దేశంలో సైబర్ క్రైం కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సైబర్ నేరస్థులు వివిధ పద్దతుల్లో జనాన్ని మోసం చేస్తున్నారు. తాజాగా ఫేక్ ట్రాన్సాక్షన్స్ స్క్రీన్ షాట్ చూపి ఓ వ్యాపారిని రూ.2 లక్షలు కుచ్చుటోపీ పెట్టారు. ఈ ఘటన గురుగ్రామ్లో జరిగింది. మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన సదరు వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

గురుగ్రాంకు చెందిన నగల వ్యాపారి అనురాధ జ్యుయెలరీ షాప్‌ నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆ షాపుకు వచ్చిన ఓ వ్యక్తి తనకు రూ.2 లక్షల విలువైన గోల్డ్ కాయిన్స్ కావాలని అడిగాడు. వాటిని తీసుకుని ఆన్‌లైన్ లో అమౌంట్ పంపుతానని చెప్పడంతో అనురాధ అంగీకరించింది. పేమెంట్ కోసం తన భర్త అకౌంట్ వివరాలు ఇచ్చింది. దీంతో సదరు కేటుగాడు ఈ అకౌంట్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ చేసినట్లు నటించి ఓ ఫేక్ స్క్రీన్‌ షాట్‌ ఆమెకు చూపాడు. అది చూసి నిజమేనని నమ్మిన అనురాధ అతనికి గోల్డ్ కాయిన్స్ ఇచ్చి పంపింది.

కాసేపటికి అనురాధ అమౌంట్ చెక్ చేయగా భర్త అకౌంట్ లో డబ్బు క్రెడిట్ కాలేదని తేలిసింది. దీంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు క్యాష్ లేదని చెప్పాడంతో రిమోట్ ట్రాన్సాక్షన్‌కి ఓకే చెప్పినట్లు ఫిర్యాదులో రాసింది.. డబ్బులు అకౌంట్‌కి సెండ్ చేసినట్లు వాట్సాప్‌లో స్క్రీన్‌షాట్‌ కూడా పంపాడని అయితే కంగారులో తాను వెరిఫై చేసుకోలేదని చెప్పింది.

నిందితుడికి ఫోన్ చేయగా తొలుత మేవట్‌కి రావాలని చెప్పాడని ఆ తర్వాత ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్‌కి వస్తే ఇచ్చేస్తానని బుకాయించాడని అనురాధ పోలీసులకు వివరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని వెతికే పనిలో పడ్డారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. ఆన్‌లైన్ పేమెంట్స్ తీసుకున్న వెంటనే డబ్బు క్రిడెట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

Updated : 17 July 2023 6:39 PM IST
Tags:    
Next Story
Share it
Top