తెగిపడిన బాలుడి తలను తిరిగి అతికించిన వైద్యులు
X
వినాయకుడి తలను పరమశివుడు ఖండించి, ఏనుగు తలను అతికించి ప్రాణం పోసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఘోర ప్రమాదంలో మొండెం నుంచి పూర్తిగా వేరైన తలను తిరిగి అతికించి సరికొత్త చరిత్ర సృష్టించారు వైద్యులు. ఈ అద్భుతం ఇజ్రాయెల్‌లో జరిగింది. సులేమాన్ హాసన్ అనే 12 ఏళ్ల బాలుడు గత నెల సైకిల్ తొక్కుతుండగా ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. సులేమాన్ తల... వెన్నుముక జాయింట్ నుంచి పూర్తిగా తెగిపోయింది. కుటుంబ సభ్యులు, వైద్యసిబ్బంది వెంటనే బాలుడిని హెలికాప్టర్లో హదసా మెడికల్ సెంటర్‌కు తరలించారు. వైద్యులు వెంటనే ఆపరేషన్ చేసి తలను అతికించారు. అత్యాధునిక టెక్నాలజీతో ఒక పూటంతా కష్టపడి సర్జరీ చేశారు.
వైద్య పరిభాషల్లో ఈ పరిస్థితిని బైలేటరల్ అట్లాంటో ఆక్సిపిటల్ జాయింట్ డిస్‌లొకేషన్ అంటారని, సకాలంలో వైద్యం జరిగితే ప్రాణాలు దక్కుతాయని వైద్యులు చెప్పారు. సులేమాన్ బతికే అవకాశం 50 శాతం మాత్రమే ఉండిందని, తమ శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి ఆపరేషన్‌ను విజయవంతం చేశారని ఆస్పత్రి తెలిపింది. సులేమాన్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడని తెలిపింది. ఇలాంట సర్జరీల వల్ల భవిష్యత్తులో కొన్ని నరాల సంబంధమైన సమస్యలు వస్తాయని, సులేమాన్‌కు ఆ పరిస్థితి రాకపోవచ్చని తెలిపింది. సులేమాన్ అతని తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. ఆర్థోపెడిక్ నిపుణుడు ఒహార్ ఐనవ్ సారథ్యంలో సులేమాన్‌కు ఆపరేషన్ జరిపారు.