భార్యాభర్తల గొడవ.. దారి మళ్లిన విమానం..
X
భార్యభర్తల గొడవతో ఓ విమానం దారిమళ్లింది. బ్యాంకాక్ వెళ్లాల్సిన విమానం.. ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్కు చెందిన ఎల్ హెచ్ 772 విమానం జర్మనీలోని మ్యూనిచ్ నుంచి బ్యాంకాక్ వెళుతోంది. అయితే విమానం గాల్లో ఉండగా ఓ జంట గొడవకు దిగింది. దంపతుల గొడవతో విమానంలో గందరగోళం ఏర్పడింది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో వారికి సర్దిచెప్పేందుకు విమాన సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. అయినా వారు వినకపోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్కు ప్రయత్నించారు.
ఈ క్రమంలో అప్పటికే విమానం పాకిస్థాన్ గగనతలంలో ఉంది. దీంతో పాక్లోని ఓ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్కు అనుమతి కోరగా.. అక్కడి అధికారులు నిరాకరించారు. దాంతో ఆ విమానాన్ని ఢిల్లీ వైపు మళ్లించారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులు అనుమతించడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వెంటనే భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకోగా.. జంటను విమాన సిబ్బంది పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత అక్కడి నుంచి విమానం టేకాఫ్ అయ్యింది. కాగా విమానంలో ఇటువంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి.