27 ఏళ్ల తర్వాత భారత్లో మిస్ వరల్డ్ పోటీలు..
X
మిస్ వరల్డ్ పోటీలు.. ప్రపంచంలోని అందగత్తెలంతా ఒకచోట చేరి తమ అందచందాలు, తెలివితేటలతో అందరినీ ఆకట్టుకునే భిన్నమైన వేదిక. ఈ పోటీలకు భారత్ మరోసారి వేదిక కానుంది. 2023 మిస్ వరల్డ్ పోటీలను మనదేశంలో నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఈ ఏడాది చివర్లో ఈ పోటీలు జరగనున్నాయి. 1996లో ఈ అందాల పోటీలకు భారత్ వేదికైంది. మళ్లీ 27ఏళ్ల తర్వాత ప్రపంచ సుందరిని నిర్ణయించే అవకాశం మన దేశానికి దక్కింది. అయితే కార్యక్రమానికి సంబంధించి ఖచ్చితమైన తేదీలు మాత్రం ఖరారు కాలేదు.
71వ మిస్ వర్డల్ పోటీలు భారత్ వేదికగా జరుగుతాయని చెప్పడానికి సంతోషంగా ఉందని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ జులియా మేర్లే తెలిపారు. ‘‘130 దేశాల జాతీయ ఛాంపియన్లు అద్భుతమైన భారతదేశంలో నెల రోజులు విడిది చేస్తారు. పలు ప్రతిభా ప్రదర్శనలు, క్రీడా సవాళ్లు, సేవా కార్యక్రమాలతో ఈ పోటీలు కొనసాగుతాయి. మార్పుకు రాయబారులుగా నిలిచే పోటీదారుల ప్రత్యేకతలను ప్రదర్శించడమే వీటి ఉద్దేశ్యం. అయితే కార్యక్రమానికి సంబంధించి తేదీలు ఖరారు కావాల్సివుంది ’’ అని ఆయన వివరించారు.
భారత్ లో మిస్ వరల్డ్ పోటీలపై 2022 ప్రపంచ సుందరి విజేత కరోలినా బిలావ్‌స్కా స్పందించారు. గొప్ప ఆతిథ్యానికి, విలువలకు ప్రతిరూపమైన ఈ అందమైన దేశంలో నా కిరీటాన్ని తదుపరి విజేతకు అందించేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా’’ అని చెప్పారు. కాగా ఈ పోటీలకు మన దేశం తరుపున సినీ శెట్టి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియా ఆరుసార్లు మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. 1994,1996,1997,1999,2000,2017 భారత్ తరుపున పోటీచేసిన అందెగత్తెలు మిస్ వరల్డ్గా నిలిచారు.