Home > వైరల్ > భూమి నుంచి వింత శబ్దాలు..వణుకుతున్న ప్రజలు

భూమి నుంచి వింత శబ్దాలు..వణుకుతున్న ప్రజలు

భూమి నుంచి వింత శబ్దాలు..వణుకుతున్న ప్రజలు
X

ప్రశాంతంగా ఉన్న ఆ ఊర్లో వింత శబ్దాలు అలజడి రేపుతున్నాయి. ఆ శబ్దాలు భూమి నుంచే వస్తున్నా..ఎందుకు వస్తున్నాయో తెలియక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కేరళలోని కొట్టాయం జిల్లాలో చెన్నపాడి అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఇవాళ ఉదయం రెండుసార్లు భారీ శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ఈ గ్రామంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఈ శబ్దాలు వచ్చినట్లు చెప్పారు. అయితే ఇవి ఎందుకు వస్తున్నాయో తెలియక వారంతా తలలు పట్టుకుంటున్నారు.

గ్రామస్థుల భయాందోళన నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారు. త్వరలోనే నిపుణుల బృందం ఆ ప్రాంతంలో పర్యటించి పరిశోధనలు చేస్తుందని అధికారులు చెప్పారు. కొద్ది రోజుల కిందట మొదటిసారి చప్పుళ్లు వినిపించినప్పుడే తాము ఈ ప్రాంతాన్ని పరిశీలించామని.. అయితే ధ్వనుల ఆనవాళ్లు తమకు లభించలేదని అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున కూడా ఇలాగే భారీ శబ్దాలు వచ్చినట్టు తమకు సమాచారం అందిందని, త్వరలోనే సెంటర్‌ ఫర్‌ ఎర్త్‌ సైన్సెస్‌ బృందం అక్కడకు వెళుతుందని వివరించారు. ఆ బృందం అధ్యయనం చేసిన తర్వాత ఆ వింత చప్పుళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది తెలుస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

గతంలో మహారాష్ట్రలోని లాతూర్‌ జిల్లాలో ఇటువంటి ఘటనే జరిగింది. పలు గ్రామాల్లో ఇలా భూమిలోపలి నుంచి వింత శబ్దాలు వినిపించాయి. అప్పుడు నిపుణులు అధ్యయనం చేసినా ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది తేల్చలేకపోయారు.

Updated : 2 Jun 2023 8:04 PM IST
Tags:    
Next Story
Share it
Top