హెల్మెట్లు పెట్టుకుని పనిచేస్తున్న అధికారులు.. ఆ భయంతోనే..
X
బండి మీద వెళ్తే హెల్మెట్ పెట్టుకుంటాం. కానీ ఓ చోట ఉద్యోగులు హెల్మెట్ పెట్టుకుని పనిచేస్తున్నారు. పైగా అది ప్రభుత్వ కార్యాలయం. వారు ఆ హెల్మెట్ను ఊరికే పెట్టుకోలేదు.. భయంతో పెట్టుకున్నారు. అవును ప్రభుత్వ కార్యాలయాలు అంటేనే శిథిల భవనాలు గుర్తుకొస్తాయి. జగిత్యాల జిల్లా బీర్పూరు ఎంపిడివో కార్యాలయం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. అందులో పనిచేసే ఉద్యోగులు హెల్మెట్ పెట్టుకుని చేస్తున్నారంటే అక్కడి పరిస్థితిని మనం అర్దం చేసుకోవచ్చు.
శిథిలావస్థకు చేరిన భవనంలో బీర్పూర్ ఎంపీడీలో కార్యాలయం కొనసాగుతుంది. ఈ భవనం ఎప్పుడు కూలుతుందో తెలియక అందులో పనిచేసే ఉద్యోగులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి భవనంలోని కొంతభాగం కుప్పకూలింది. అటు భవనం కూడా బాగా నానడంతో ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. దీంతో అధికారులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పనిచేస్తున్నారు.
ఈ క్రమంలోనే రక్షణ కోసం అధికారులు హెల్మెట్లు పెట్టుకుని పనిచేస్తున్నారు. సమస్యను ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. అటు కార్యాలయానికి వచ్చే ప్రజలు కూడా భయపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయమే శిథిలావస్థలో ఉంటే.. ఇంకా ప్రజాసమస్యలు ఏం పరిష్కరిస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. సమస్యను పరిష్కరిస్తారా అన్నది వేచి చూడాలి.