PUBGలో పరిచయం.. ఆన్లైన్లో ప్రేమ..
X
ప్రేమ సరిహద్దుల్ని దాటేలా చేస్తుంది. ఇద్దరు ప్రేమికుల్ని కలిపేందుకు.. ఎంతటి దారుణానికైనా ఒడి గడుతుంది. తాజాగా ఓ ప్రియురాలు తన ప్రియుడికోసం భర్తను వదిలి, అక్రమంగా దేశాన్ని దాటేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్ కు చెందిన సీమా గులాం హైదర్ కు, నోయిడాకు చెందిన సచిన్ తో ఆన్ లైన్ గేమ్ పబ్జిలో పరిచయం అయింది. తర్వాత ఈ ఇద్దరు సోషల్ మీడియా అకౌంట్ లో చాట్ చేసుకున్నారు. కొన్నాళ్లకు వీరి పరిచయం ప్రేమగా మారింది. ప్రియుడిని విడిచి ఉండలేక.. పాకిస్థాన్ వదిలి తన నలుగురు పిల్లలతో అక్రమంగా ఇండియాలోకి చొరబడింది. ప్రస్తుతం వీరంతా నోయిడాలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే ఆ అపార్ట్ మెంట్ యజమానికి వీరిపై అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించాడు. వీళ్లను పట్టుకుని పోలీసులు తమదైన శైలిలో విచారణ జరుపగా.. విస్తు పోయే విషయాలు బయటపడ్డాయి.
సీమాకు పాకిస్థాన్ లో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అతను సౌదీ అరేబియాలో పనిచేసే వాడు. అయితే, ప్రస్తుతం సీమా గృహ హింస బాధితురాలు. తన భర్త కొట్టే వాడని, హింసించే వాడని చెప్పుకొచ్చింది. నాలుగేళ్ల నుంచి సీమా తన భర్తతో విడిపోయి ఉంటుందట. తన అన్న పాకిస్థాన్ ఆర్మీలో పనిచేస్తున్నాడని వివరించింది. ఆ టైంలోనే సచిన్ తో సీమాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. దాంతో సీమా అక్రమంగా తన నలుగురు పిల్లలతో ఇండియాకు చేరుకుంది. ప్రస్తుతం పోలీస్ విచారణ ఇంకా కొనసాగుతోంది.