Home > వైరల్ > తాగి కొట్టడం తప్పే..భార్య కాళ్లు మొక్కిన భర్త

తాగి కొట్టడం తప్పే..భార్య కాళ్లు మొక్కిన భర్త

తాగి కొట్టడం తప్పే..భార్య కాళ్లు మొక్కిన భర్త
X

భార్యాభర్తల అనుబంధంలో చిన్నపాటి గొడవలు సహజమే. అలకలు మామూలే. సర్దుకుపోయే గుణం ఉంటే చాలు భార్యాభర్తల బంధం కలకాలం తోటివారికి ఆదర్శప్రాయంగా ఉంటుంది. కానీ ఈగోలకు పోతే చిన్న గొడవ కాస్త తెగే వరకు వస్తుంది. అలా తెగే వరకు వచ్చిన ఓ బంధానికి చివరికి శుభం కార్డు పడింది. భర్త తాగి వచ్చి తనను కొడుతున్నాడంటూ ఓ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తరువాత ఈ కేసు రాజీ కొరకు భార్యాభర్తలు ఇద్దరూ జాతీయ లోక్ అదాలత్‎ను సంప్రదించారు. రాజీ సమయంలో ఓ అరుదైన ఘటన జరిగింది. భర్త తాను చేసిన తప్పును తెలుసుకుని ఏకంగా భార్య కాళ్లను మొక్కి భావోద్వేగానికి గురయ్యాడు. ఈ ఘటన చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో ఈ న్యూస్ స్థానికంగా చర్ఛనీయాంశంగా మారింది.

ఈ ఘటన తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే...గద్వాలలోని సుంకులమ్మ మెట్టుకు చెందిన గోవింద్ అనే వ్యక్తి ఓ డ్రైవర్. ఆయన రాజేశ్వరి అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే గోవిందు ప్రతి రోజు తాగేవాడు. ఆ మైకంలోనే భార్యతో తరచుగా గొడవ పడేవాడు ఆమెను కొట్టేవాడు. దీంతో భర్త తాగుడుకు విసుగెత్తిపోయిన రాజేశ్వరి కొన్ని రోజుల క్రితం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో తాజాగా దంపతులు ఇద్దరూ రాజీ కోసం జాతీయ లోక్ అదాలత్‌కు వెళ్లారు.

డిస్ట్రిక్ట్ చీఫ్ జస్టీస్ కె.కుషా సమక్షంలో జరిగిన లోక్ అదాలత్‌లో భార్య భర్తలిద్దరిని పిలిపించి అసలు ఏం జరిగింతో ఆరా తీశారు. ఈ క్రమంలో భార్య రాజేశ్వరి తన భర్త అంటే తనకు ఎంతో ఇష్టమే చెప్పుకొచ్చింది. అయితే ప్రతి రోజూ మద్యం తాగి తనను కొడుతున్నాడని చెప్పింది. ఇది తనను ఎంతగానో బాధిస్తుందని తన బాధను చెప్పుకొచ్చింది. భార్య చెప్పింది విన్న గోవింద్ విషయాన్ని ఒప్పుకున్నాడు. తాను చేసింది తప్పేనని ఒప్పుకున్నాడు. పెద్దవాళ్లు ఏం చెబితే అదే చేస్తానని తెలిపాడు. దీంతో అక్కడున్నవారు భార్యాభర్తలను పిలిచి దండలు మార్చుకోవాలని తెలిపారు. అందరి సమక్షంలో ఇద్దరూ దండలు మార్చుకున్నారు. ఈ క్రమంలో భార్యభర్తలిద్దరూ కన్నీరుమున్నీరయ్యారు.భర్త గోవింద్ భావోద్వేగానికి గురయ్యారు. తాగిన మత్తులో భార్యను కొట్టడం తప్పేనని నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో భార్యకు క్షమాపణ చెప్పాలని లాయర్లు కోరగా తన భార్యకు క్షమాపణలు కాదు కాళ్లు మొక్కుతా అంటూ ఆమె కాళ్ల మీద పడిపోయాడు. ఈ దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఘటనతో లోక్ అదాలత్ ఒక్కసారిగా చప్పట్లు, విజిల్స్‎తో మారుమోగింది.



Updated : 9 Sep 2023 4:00 PM GMT
Tags:    
Next Story
Share it
Top