Ayodhya Ram Mandir : రామాలయానికి 400 కిలోల భారీ తాళం..
X
అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. భారత ప్రజల చిరకాల కోరికైన రామ మందిరాన్ని చూసేందుకు యావత్ ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 2024 జనవరి చివరికల్లా ఆలయ నిర్మాణం పూర్తిచేసి.. భక్తులను అనుమతించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆలయంలో విగ్రహాల ప్రతిష్ట జనవరి 14 నుంచి 24 మధ్య ఉంటుందని, 25వ తేదీ నుంచి దర్శనం చేసుకోవచ్చని తెలిపారు. ఈ క్రమంలో ఆలయ నిర్మాణంలో పాలు పంచుకునేందుకు పలువురు తమకు తోచిన సాయం చేస్తున్నారు. అందులో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ అలీగఢ్ కు చెందిన సత్య ప్రకాశ్ శర్మ అనే వృద్ధ కళాకారుడు రామమందిరం కోసం ఏకంగా 400 కిలోలున్న భారీ తాళాన్ని తయారుచేశాడు. 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అంగుళాల మందమున్న ఈ తాళానికి 4 అడుగుల తాళం చెవి కూడా ఉంది.
సత్య ప్రకాశ్ శర్మ అలీగఢ్ లో గత 46 ఏళ్లుగా తాళాలు తయారుచేస్తు పేరు పొందారు. అనే రకాల ఆకర్షనీయ తాళాలు తయారుచేసి కీర్తి పొందారు. అందులో భాగంగా.. సత్యప్రకాశ్ రామమందిరానికి తాళం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ భారీ తాళం తయారీకి ఆయన భార్య రుక్మిణి కూడా సహకరించింది. ఎప్పటి నుంచో దాచుకున్న రూ.2 లక్షలను తాళం తయారీకి తన ఇష్టపూర్వకంగా ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ తాళం వీళ్ల దగ్గరే ఉంది. 2024 జనవరిలో జరిగే ఆలయ ప్రారంభోత్సవానికి దీన్ని బహుకరిస్తారు. కాగా, ప్రస్తుతం దీన్ని అలీగఢ్ లో ఓ ఎగ్జిబీషన్ లో ప్రదర్శనకు ఉంచారు. అందులో కొన్ని మార్పులు, అలంకరణ చేసి.. రామమందిర్‌లో ముడుపుల వేడుక రోజు గుడికి అందిస్తానని సత్య ప్రకాశ్ శర్మ చెప్తున్నాడు.