ఖాకీ దుస్తుల్లో విలనిజం.. సీఐ అంజు యాదవ్ మరో వీడియో
X
జనసేన కార్యకర్తపై చేయి చేసుకొని ఈ మధ్య వార్తల్లో నిలిచిన శ్రీకాళహస్తి సీఐ సీఐ అంజూయాదవ్ కు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే గతేడాది ఓ మహిళను లాక్కెళుతున్న దృశ్యాలతోపాటు.. కొన్ని రోజుల క్రితం రోడ్లపై నిరసన చేపట్టిన ప్రతిపక్ష పార్టీల నేతలను చెంపలపై కొడుతున్న సంఘటనలు బయటపడ్డాయి. తాజాగా ఆవిడ విశ్వరూపం ఇదే అనిపించేలా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో తనపై కేసు పెట్టిన వారి హోటల్ ముందు నిల్చొన్న సీఐ అంజూయాదవ్... ఒకవైపు సెల్‌ఫోన్‌తో వీడియో తీస్తూనే గట్టిగా వెకిలి నవ్వులు నవ్వుతూ.. తొడ కొడుతున్న వీడియో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సీఐ స్థాయి ఓ లేడీ ఆఫీసర్... నవ్వుతూనే బెదిరింపులకు దిగడం ఖాకీ దుస్తుల్లో ఉన్న అంజూయాదవ్ విలనిజాన్ని చూపుతోంది.
ఇప్పటికే జనసేన కార్యకర్తపై అంజూయాదవ్ ప్రవర్తించిన తీరుపై ఏపీ HRC నోటీసులు కూడా జారింది. ఈనెల 27లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించిన క్రమంలో మరో వీడియో బయటకు రావడం హాట్‌టాపిక్‌గా మారింది. అటు.. ఆమె ప్రవర్తన పోలీసు శాఖలోనూ చర్చనీయాంశంగా మారింది. అంజూయాదవ్ వ్యవహార శైలిపై ఉన్నతాధికారులు కూడా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. జిల్లా ఎస్పీ ఇప్పటికే డీఐజీకి నివేదిక ఇవ్వడంతో.. క్రమశిక్షణకు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది.
మరోవైపు ఈ రోజు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సీఐ అంజూ యాదవ్ పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు తిరుపతి వస్తున్నారు. అంజూ యాదవ్ జోలికొస్తే ఊరుకోబోమని పవన్ ని హెచ్చరించారు బీసీ, యాదవ సంఘాల నేతలు. ఈ నేపథ్యంలో అసలు తిరుపతిలో ఏం జరుగుతోందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. జనసేన పార్టీ నేతలను అడ్డుకోడానికి వైసీపీ మద్దతుతో కొంతమంది బీసీ నాయకులు హడావిడి చేసే అవకాశం కూడా ఉంది. నేరుగా వైసీపీ నేతలు తెరపైకి రావొచ్చు, వాలంటీర్లు కూడా ఆందోళనలకు సిద్ధపడొచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలో తిరుపతి పోలీసులు టెన్షన్ పడుతున్నారు. పవన్ పర్యటన విషయంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.