Home > వైరల్ > ఇంటికి కన్నం వేద్దామని వచ్చారు.. సీన్ రివర్స్

ఇంటికి కన్నం వేద్దామని వచ్చారు.. సీన్ రివర్స్

ఇంటికి కన్నం వేద్దామని వచ్చారు.. సీన్ రివర్స్
X

నెల రోజుల క్రితం ఢిల్లీలో ఓ వింత దొంగతనం జరిగింది. స్కూటీపై వెళ్తున్న ఓ జంటను దోచుకోవాలని నిర్ణయించుకున్న ఇద్దరు దొంగలు.. దోపిడి చేసేందుకు స్కూటీ ఆపి తుపాకీతో బెదిరించారు. అనంతరం వారిని దోపిడి చేయడానికి ప్రయత్నించారు. అయితే వారివద్ద కేవలం రూ.20లే దొరకడంతో... వారి పరిస్థితి చూసి జాలిపడి... ఆ దొంగలే తిరిగి వారికి రూ.100 నోటు ఇచ్చారు. అనంతరం అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు. ఢిల్లీలోని షహదారాలోని ఫర్ష్ బజార్ లో జరిగిన ఘటన అంతా అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డు కావడంతో నెల క్రితం ఈ వార్త తెగ వైరల్ అయింది. సరిగ్గా అలాంటి ఘటనే ఢిల్లీలోని మరో ప్రాంతంలో జరిగింది.

రోహిణిలోని సెక్టార్ 8లోని ఓ ఇంట్లో చోరీ చేసేందుకు ప్రయత్నించారు గుర్తు తెలియని వ్యక్తలు. అయితే ఆ ఇంట్లో విలువైన వస్తువులు కానీ,డబ్బులు కానీ దొరకకపోవడంతో రూ.500 నోటును వదిలివెళ్లారు. జులై 20-21 మధ్య రాత్రి జరిగిన ఈ వింత ఘటన ఇంటి యజమాని ఫిర్యాదు చేయడంతో బయటకు వచ్చింది. 80 ఏళ్ల రిటైర్డ్ ఇంజినీర్ రామకృష్ణ... జులై 19న సాయంత్రం తన భార్యతో కలిసి గురుగ్రామ్‌లో నివసించే తమ కొడుకు వద్దకు వెళ్లాడు. అయితే రోహిణిలోని తన ఇంట్లో జులై 21 తెల్లవారుజామున దొంగతనం జరిగినట్లు ఇరుగుపొరుగు వారి నుంచి కాల్ రావడంతో వెంటనే ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ప్రధాన గేటు తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించాడు. లోపలికి వెళ్లి చూడగా దొంగలు ఏమీ దొంగిలించలేదని తెలిసింది.

ఇదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు రామకృష్ణ. మెయిన్ డోర్ వద్ద రూ.500 నోటు పడి ఉందని చెప్పాడు. తన ఇంట్లో విలువైన వస్తువులేవీ ఉంచుకోలేదని పోలీసులకు రామకృష్ణ తెలిపాడు. అల్మారాలు చెక్కుచెదరకుండా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్‌లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నారు. తదుపరి విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలను బట్టి చూస్తుంటే ఢిల్లీలోని దొంగలు కూడా కాస్త మనసున్నవారేమో అనిపిస్తోంది.



Updated : 24 July 2023 2:04 PM IST
Next Story
Share it
Top