ఎంఎన్సీ కంపెనీకి కూడా టమాటా సెగ
X
దేశవ్యాప్తంగా టమాటా ధరలు చుక్కలను తాకుతున్నాయి. నిత్యం వంటల్లో వినియోగించే టమాటాను కొనుగోలు చేయాలంటేనే సామాన్యుడు భయపడిపోతున్నాడు. ప్రస్తుతం మార్కెట్లో టమాటా ధర రూ.200 పైకి చేరుకుంది. టమాటా సాగు అధికంగా అయ్యే ప్రాంతాల్లో అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉత్పత్తి తగ్గింది. దీంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. మొన్నటి వరకు 10 రూపాయలు పలికిన ధర కాస్తా ఇప్పుడు 200పైకి వెళ్లడంతో వినియోగదారులు టమాటాకు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంటున్నారు. సామాన్యులే కాదు ఎంఎన్సీ కంపెనీలకు కూడా టమాటా సెగ తగిలింది. తమ ఆహార ఉత్పత్తుల్లో టమాటాల వినియోగాన్ని నిలిపివేస్తున్నట్లు మెక్‌డొనాల్డ్స్ సంస్థ నోటీసులు పెట్టింటింది. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
సాధారణంగా జూన్, జులై నెలల్లో టమాటాల ధరలు పెరుగుతుంటాయి. కానీ ఇంతలా ధరలు ఎప్పుడూ చుక్కలను తాకలేదు. భారత్లోని చాలా ప్రాంతాలలో టమాటాల సరఫరా కొరత, నాణ్యత లేమి ఇబ్బందికరంగా మారింది. ఈ సమయంలో మెక్‌డొనాల్డ్స్ వంటి సంస్థలు కూడా టమాటా వినియోగాన్ని నిలిపివేశాయి. వారి రెస్టారెంట్‌లలో తయారు చేసే ఆహార ఉత్పత్తుల్లో టమాటాలు వాడటం లేదని అవుట్ లెట్ బయట నోటీసులో పేర్కొంది. మార్కెట్లో నాణ్యమైన టమాటాల కొరత కారణంగానే బర్గర్లను టమాటా లేకుండా అందిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫోటోనే ఇప్పుడు నెట్టింట చెక్కర్లు కొడుతోంది.
మెక్‌డొనాల్డ్స్ నోటీసులను చూసిన సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ ఆదిత్య షా తన ట్విట్టర్లో ఈ ఫోటోనే షేర్ చేశారు. ఢిల్లీలోని మెక్‌డొనాల్డ్స్ బ్రంచ్ తన అవుట్ లెట్ ముందు ఈ నోటీసులు ఉంచిందని , చివరకు మెక్‌డొనాల్డ్స్ కూడా టమాటాలను కొనుగోలు చేయలేకపోతోందని సరదాగా కామెంట్ చేశారు.