Donald trump: ‘మా నాన్న చనిపోయారు.. తర్వాత అధ్యక్షుడిని నేనే’: ట్రంప్ కొడుకు
X
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరణించారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ప్రచారం అయింది. ఆ పోస్ట్ కూడా ఏకంగా ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్విట్టర్ అకౌంట్ నుంచే రావడంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. ట్రంప్ మద్దతు దారులు కలవరపడ్డారు. ఆ పోస్ట్ లో ‘ఈ విషయం చెప్పడానికి చింతిస్తున్నా. మా నాన్న చనిపోయారు. 2024లో అధ్యక్ష పదవికి నేనే పోటీ చేస్తా’ అని ఉంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ పోస్ట్ చర్చనీయాంశం అయింది. అయితే, ట్రంప్ కొడుకు పెట్టింది కాదని తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
వాస్తవం ఏంటంటే.. ట్రంప్ జూనియర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. అకౌంట్ హ్యాక్ చేసిన దుండగులు ఈ పోస్ట్ పెట్టారు. అయితే బుధవారం ఉదయం ఈ పోస్ట్ పెట్టడంతో అంతా దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నారు. పోస్ట్ విషయం తెలిసిన ట్రంప్ జూనియర్ వెంటనే ఖాతాను పునరుద్దరించుకుని, పోస్ట్ డిలీట్ చేశాడు. అయినా వార్త అన్ని మీడియాల్లో ప్రచారం అయింది. ప్రపంచానికి తెలిసిపోయింది. దాంతో జరిగిన విషయాన్ని ట్రంప్ జూనియర్ ట్వీట్ చేశాడు. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున తాను పోటీచేస్తానని ఇప్పటికే ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.