ఇదేం పైత్యంరా అయ్యా...ఫేమస్ అయ్యేందుకు ఎంత పని చేశాడు
X
ఇప్పుడున్నదంతా స్మార్ట్ యుగం. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను విపరీతంగా వాడేస్తున్నారు. పొద్దున నిద్ర లేచింది మొదలు అర్థరాత్రి వరకు ఫోను మైకంలోనే యువత మునిగితేలుతోంది. చాలా మంది కంటెంట్ క్రియేటర్లు రకరకాల వీడియోలు, రీల్స్ షేర్ చేస్తూ ఫేమస్ అవుతున్నారు. మరికొంత మంది ఎలాగైనా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని నానా తంటాలు పడుతున్నారు. వింత వింత ప్రయత్నాలు, సాహసాలు చేస్తూ తాము ఏం చేస్తున్నామన్న విచక్షణను కోల్పోతున్నారు. పిచ్చి పిచ్చ ప్రయోగాలతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
లేటెస్టుగా ఇలాంటి ఘటనే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఫేమస్ అవ్వాలని ఓ యువకుడు రైలు రన్నింగ్‌లో ఉండగానే పట్టాల మీద పడుకుని వెర్రి వేషాలు వేశాడు. ఈ సీన్‌ను ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియాను కాస్తా టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కంట్లో పడటంతో తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. ఫేమస్ అవ్వటం కోసం ప్రాణాలు పణంగా పెట్టడం సరైన పనేనా అంటూ ఆయన ప్రశ్నించారు.
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు పట్టాలపై నిల్చుంటాడు. రైలు హారన్ కొడుతున్నా..అక్కడి నుంచి కదలలేదు. ట్రైన్ తన దగ్గరికి రాగానే పట్టాల మీద పడుకున్నాడు. రైలు వెళ్లేంత వరకు పట్టాలమీదనే అలాగే కదలకుండా పడుకున్నాడు. ట్రైన్ వెళ్లిపోగానే ఏదో ఘనత సాధించినట్లు లేచి నిలబడి వెర్రి గంతులు వేస్తాడు. ఇదంతా కూడా అతని స్నేహితుడు పక్కనే ఉండి సెల్‌ఫోన్‌లో రాకార్డ్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. దాన్ని పోస్ట్ చేసిన టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ యువకుడి వెర్రివేషాలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఇలాంటి పిచ్చిపనులు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇలాంటి సాహసాలు చేస్తే..ఏమాత్రం పొరపాటు జరిగిన ప్రాణాల మీదికి వస్తుందని హెచ్చరించారు. లైకులు , షేర్ల కోసం ఇలా ప్రాణాలను సైతం పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం !?" అని సజ్జనార్ ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో పాపులర్ కావడం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. పేమస్ కోసం సాహసాలు చేస్తే.. చిన్న పొరపాటు జరిగిన ప్రాణాల మీదికి వస్తుంది.
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) August 2, 2023
జనాదరణ కోసం జీవితాలను సైతం పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!? pic.twitter.com/wc3BSQVhA1