Guinness Record : పొడవైన గడ్డంతో గిన్నీస్ రికార్డ్ సాధించిన మహిళ
X
సాధారణంగా అబ్బాయిలకు గడ్డం వస్తుంది. అమ్మాయిలకు గడ్డం రావడం అనేది చాలా అరుదు. ఒకవేళ వచ్చినా ఆమె ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఓ చోట మహిళకు గడ్డం రావడమే కాదు.. పొడవైన గడ్డంతో గిన్నీస్ రికార్డ్ సృష్టింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. మిషిగాన్కు చెందిన ఎరిన్ హనీకట్కు చిన్నప్పటి నుంచే జన్యుపరమైన సమస్యలు ఉన్నాయి. దీంతో ఆమె 13ఏళ్లు ఉన్నప్పుడే ఆమెకు గడ్డం వచ్చింది.
అబ్బాయిల్లాగ గడ్డం రావడంతో ఎరిన్ తీవ్ర ఆందోళన చెంది.. రోజుకు మూడు, నాలుగు సార్లు షేవింగ్ చేసుకునేది. గడ్డాన్ని తొలగించేందుకు రకరకాల క్రీమ్లను వాడేది. అయినా వాటితో ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. ఆ తర్వాత ఆమెకు ఐ స్ట్రోక్ వచ్చి పాక్షికంగా దృష్టిని కోల్పోయింది. దాంతో షేవ్, చేయడం, క్రీమ్స్ వాడడం ఆపేశారు. అయితే తీవ్ర మానసిక సంఘర్షణకు గురైన ఆమెకు స్నేహితులు, బంధువులు భరోసా కల్పించారు.
ఈ క్రమంలో హనీకట్ అడ్డుంకులను అధిగమించి జీవితంలో ముందుకు సాగింది. ఫిబ్రవరిలోనే ఆమె అత్యంత పొడవైన గడ్డం కలిగిన మహిళగా గిన్నీస్ రికార్డ్ సృష్టించగా.. అధికారులు రెండు రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు. కాగా తనకు అండగా నిలిచిన కుటుంబసభ్యులు, బంధువులకు ఈ అవార్డును అంకితమిస్తున్నట్లు హనీకట్ తెలిపారు. తాను సాధించిన ఈ రికార్డు వైద్యం చేయించుకునేందుకు సాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.