లాటరీ తంతే 25 ఏళ్లు డబ్బుకట్టల్లో పడిన భారతీయుడు.. కష్టాల పీడ విరగడైంది..
X
తంతే బూరెల బుట్టలో కాదు, ఇతనిలా డబ్బు కట్టల్లో పడాలి. తర్వాత బూరెల బుట్టలో ఏం ఖర్మ బంగారు బుట్టలోనే పడొచ్చు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మొహమ్మద్ ఆదిల్ ఖాన్ అనే వ్యక్తికి భారీ లాటరీ తగిలింది. ఒకసారి డబ్బులిచ్చి సరిపెట్టుకునే లాటరీ కాదు. ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు నెలనెల రూ. 5.5 లక్షలు అతని ఖాతాలలో పడనున్నాయి. అంటే పాతికేళ్లలో అతనికి మొత్తర రూ. 16. 5 కోట్లు దక్కనుంది. నెల నెలా వచ్చేన డబ్బుపై వడ్డీ, చక్రవడ్డీ కూడా లెక్కవేసుకుంటనే కోట్లే కోట్లు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో నిర్వహించిన ‘ఫాస్ట్ 5’లో లాటరీలో ఆదిల్ ఖాన్ ఈ మెగా ప్రైజ్ మనీ కొట్టాడు. పొట్టకూటి కోసం యూఏఈ వెళ్లిన ఆదిల్ ఒక రియల్‌ఎస్టేట్ సంస్థలో ఇంటీరియర్ డిజైన్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. యూఏఈకి వెళ్లిన చాలామంది విదేశీయులకు లాటరీలంటే పిచ్చి కావడంతో తనూ ఓసారి ట్రై చేద్దామనుకున్నాడు. ఫాస్ట్ 5 మెగా ప్రైజ్ మనీ డ్రా తీయగా ఆదిల్ తొలి విజేతగా నిలిచాడు. లాటరీ నిబంధనల ప్రకారం అతనికి ప్రతి నెల 25 వేల దిర్హమ్‌లు (రూ. 5.59) చొప్పున 25 ఏళ్లపాటు ఇస్తారు. జాక్ పాట్ తగలడంపై ఆదిల్ హర్షం వ్యక్తం చేశారు. కష్టకాలంలో తనను అదృష్టం వరించినందుకు సంతోషంగా ఉందని చెప్పాడు. తన కుటుంబానికి తనొక్కడిననే ఆధారమని, దేవుడే తనకు దారి చూపాడని అన్నాడు. తన సోదరుడు చనిపోవడంతో అతని కుటుంబాన్ని తనే పోషిస్తున్నానని, తమ జీవితాల్లో వెలుగు వచ్చిందని భావోద్వేగానికి గురయ్యాడు. ‘‘లాటరీ తగిలిందంటే మా వాళ్లు నమ్మలేదు. నంబర్ చెక్ చేసుకోమని చెప్పారు.. డబ్బు కొద్దికొద్దిగానే వచ్చినా పొదుపు చేసుకుని భవిష్యత్తు అవసరాలకు వాడుకుంటాను’’ అని అన్నాడు ఆదిల్.