ఉత్తర్‌ప్రదేశ్‌లో వింత పెళ్లి..ఏకంగా శివుడినే పెళ్లాడిన యువతి
X
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ వింతైన పెళ్లి జరిగింది. ఓ యువతి భక్తి భావంతో ఏకంగా భగవంతుడినే పెళ్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది.
కుమార్తెను సంతోషపెట్టేందుకు ఆమె తల్లిదండ్రులు ఈ వివాహానికి అంగీకారం తెలిపారు. ఇంకేముందు బంధుమిత్రుల సమక్షంలో, బ్యాండు బాజాల నడుమ పల్లకిలో ఊరేగింపుగా వెళ్లి మరీ యువతి శివుడిని వివాహమాడింది. శివుని విగ్రహానికి పూల మాల వేసి ఆయనకు తనను తాను అర్పించుకుంది. భగవంతుడిపై భక్తితో ఆయన్ను భర్తగా స్వీకరిచించింది.దీంతో ఈ పెళ్లి స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.
ఈ ప్రత్యేక వివాహం ఝాన్సీ జిల్లాలో జరిగింది. అన్నపూర్ణ కాలనీకి చెందిన యువతి శివుడిని పెళ్లాడింది. యువతి ఆమె తల్లిదండ్రులు..చాలా కాలంగా బ్రహ్మకుమారి సంస్థతో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే యువతి శివుడిపై మమకారాన్ని పెంచుకుంది. ఆయన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కూతురు నిర్ణయానికి ఆమె పేరెంట్స్ కూడా స్వాగతించారు. ఇక తన జీవితాన్ని పరమశివుడికి అంకితం చేయాలని యువతి నిశ్చయించుకుంది. శివుడితో పెళ్లి అనగానే ఏదో గుడిలో సాదాసీదాగా జరుగిందనుకుంటే పొరపాటే. సంప్రదాయ పద్ధతిలో గ్రాండ్ గా శివుడిని వివాహం చేసుకుంది యువతి. అందులోనూ ఆ యువతి పేరెంట్స్ నెల ముందు నుంచే పెళ్లి ఏర్పాట్లను ప్రారంభించారు. శివునితో మా కూతురి పెళ్లి అంటూ బంధువులకు ఆహ్వాన పత్రికలు పంపించారు. అంగరంగవైభవంగా పరమశివుడితో ఆ యువతి పెళ్లి జరిపించారు. ఆ తరువాత విందు భోజన ఏర్పాట్లు కూడా చేశారు.