గుడిలో చెప్పులు పోయాయని పోలీసులకు ఫిర్యాదు..
X
కొత్త చెప్పులు పోతే ఆ బాధ వర్ణనాతీతం. కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్నవాటిని కనీసం వారం కూడా తిరగముందే దొంగలు కొట్టేస్తే మనసు చివుక్కుమంటుంది. ఎవరికన్నా చెబితే, కోట్లు పోగొట్టుకున్నట్లు అంత బాధమేమిటని నవ్వుకుంటారు. చెప్పుకోకపోతే మనసులో బాధ. పోయినవి తిరిగి రావని గుండె దిటవు చేసుకుని సరిపెట్టువాల్సిందే. అయితే కాంతిలాల్ నిగమ్ అనే పెద్దమనిషి అలా సరిపెట్టుకోలేదు. తన చెప్పులు ఎవడో కొట్టేశాడని, ఎక్కడున్నా తీసుకొచ్చి తనకు అప్పగించాలని పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన తతంగం ఇది. కాంతిలాల్ ఆదివారం భైరవ్ బాబా ఆలయానికి వెళ్లాడు. కొత్త కొత్తచెప్పులైనా, ఎంత ఖరీదైనవైనా గుడి బయట వదిలి వెళ్లాల్సిందే కదా. కొత్త చెప్పులు కొట్టేస్తారని, చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్లు లోపలికి వెళ్లి స్వామిదర్శనం చేసుకొచ్చాడు. బయటికొచ్చాక చెప్పులు మాయమయ్యాయి. చుట్టుపక్కల ఎంత వెతికినా కనిపించలేదు. లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోయిన చెప్పులను మొన్ననే కొన్నానని, వాటి సైజు 7 అంగుళాలు, రంగు నీలమని, అవి ఆక్యుప్రెషర్ చెప్పులని వివరంగా ఫిర్యాదు చేశాడు. పోయిన చెప్పులు తనవేనని చెప్పడానికి సాక్ష్యంగా చెప్పుల షాపు యజమాని ఇచ్చిన బిల్లును కూడా చూపించాడు. దొంగ ఎక్కుడున్నా పట్టుని వాటిని తనకకు స్వాధీనం చేసి, కఠినంగా శిక్షించాలని కోరాడు. పోలీసులు మొదట నవ్వుకున్నా నిబంధనల ప్రకారం ఫిర్యాదు స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి చెప్పుల వేటలో పడ్డారు.