బౌన్సర్లను పెట్టుకున్న టమాటాల వ్యాపారి..
X
మానవ జాతిచరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డు పలుకుతున్న టామాట ధరలు సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కేజీలకు కేజీలు కొన్న జనం ఇప్పుడు వంద గ్రాములు, పావు కిలోతో పరిపెట్టుకుంటున్నారు. టామాటల ధర కొన్నిచోట్ల కేజీ రూ. 250, కొన్ని చోట్ల రూ. 160 పలుకుతోంది. కొనలేక ప్రజలు కష్టాలుపడుతుంటే దాచుకోలేక వ్యాపారులు యాతన పడుతున్నారు. పొలంలోని టామాటాలానే కాదు, షాపుల్లోని పళ్లనూ బాధితులు లూటీ చేస్తున్నారు. లూటీ బాధ భరించలేక ఓ వ్యాపారి ఏకంగా బౌన్సర్లను పెట్టుకున్నాడంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది.
ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి మార్కెట్లో కూరగాయలు అమ్మే అజయ్ ఫౌజీ అనే వ్యాపారి వింత కథ ఇది. టామాటాను కాపాడుకోవడానికి అతడు వేల జీతం తగలేసి ఇద్దరు బౌన్సర్లను పెట్టుకున్నాడు. కొనడానికి వస్తున్న జనం ధర విని గొడవలు పడుతున్నారుని, సందట్లో సడేమియాగా లూటీ చేసిపోతున్నారని అజయ్ చెప్పాడు. ‘‘అందరితో కొట్లాడడం సాధ్యం కాదు. బౌన్సర్లను పెట్టుకుంటే వాళ్లే చూసుకుంటారని ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ రోజు టమాటా ధర రూ.160. చాలామంది ధర విని కళ్లు తేలేసి వెళ్లిపోతున్నారు. కొందరు 50 గ్రాములు, కొందరు 100 గ్రాములు కొంటున్నారు’’ అని తెలిపాడు. టామాటా ధర కొండెక్కడంతో కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఓ రైతు పొలం నుంచి రూ. 3 లక్షల ఖరీదైన పంటను దొంగలు ఎత్తుకెళ్లారు. చాలా మార్కెట్లలో టామాటా బుట్టలు గల్లంతవుతున్నాయి. ధర లేనప్పడు స్వేచ్ఛగా వదిలేసిన రైతులు, వ్యాపారులు ఇప్పుడు నిద్ర మేల్కొని కాపలా కాస్తున్నారు. వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో దేశవ్యాప్తంగా టామాలకు కరువొచ్చి పడింది.