హీరో విజయ్‌కు షాక్.. జరిమానా విధించిన పోలీసులు
X
తమిళ్ స్థార్ హీరో విజయ్ దళపతికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా స్థాయిలో ఆయన సినిమాలు హిట్ టాక్ ను సొంతం చేసుకుంటుంటాయి. సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ ఇప్పుడు రాజకీయాలపై కూడా దృష్టి పెట్టారు. గతంలో విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అలాగే ఇప్పుడు పాదయాత్ర చేయబోతున్నారని కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా దళపతి విజయ్ ట్రాఫిక్ నింబంధనలు ఉల్లంఘించారని పోలీసులు జరిమానా విధించారు.
మంగళవారం పనైయూర్‌లోని తన కార్యాలయంలో విజయ్.. కొంత మంది విజయ్ మక్కల్ ఇయక్కం జిల్లా నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు ఆయన నీలాంగరైలోని తన ఇంటి నుంచి టయోటా ఇన్నోవా క్రిస్టా కారులో వెళుతుండగా అకైర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. జంక్షన్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడడంతో అన్ని వాహనాలు సిగ్నల్‌లో ఆగాయి. కాని విజయ్ కారు ట్రాఫిక్ సిగ్నల్‌ను పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆయన కారుకు జరిమానా విధించాలని నెటిజన్లు కోరారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు నటుడు విజయ్ కారుకు గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీసులు రూ.500 జరిమానా విధించారు. గతేడాది నవంబరులో విజయ్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి కారుకు నల్ల రంగు స్టిక్కర్ అతికించినందుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా విజయ్ రాజకీయాల్లోకి వస్తారనే ఆశతో ఆయన అభిమానులు ఉన్నారు. ఆయన అభిమాన సంఘాలను విజయ్ మక్కల్ ఇయక్కంగా మార్చి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవల నీలావంగరైలోని కల్యాణ మంటపంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను నగదు బహుమతులు అందజేశారు. ఈ నేపథ్యంలో చెన్నై పనైయూర్‌లో ఉన్న తన కార్యాలయంలో 234 నియోజక వర్గాల్లోని ఇయక్కం నిర్వాహకులతో మంగళవారం రాత్రి వరకు సమావేశం నిర్వహించారు.