ఈ బిచ్చగాడు ప్రపంచంలోనే వెరీ రిచ్...ఆస్తి ఎంతో తెలుసా?
X
ధనవంతులు అనగానే వ్యాపారస్తులు, హీరోలు , హీరోయిన్లు, సెలబ్రిటీలే ఎక్కువగా గుర్తుకు వస్తారు. కానీ అవేమి చేయకుండానే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ట్రాఫిక్ సిగ్నళ్లు, గుళ్లల్లో చిల్ల పైసలు అడుక్కుంటూ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు ఓ బిచ్చగాడు. అడుక్కున్న ఒక్కో రూపాయి పోగు చేసి కోట్లు సంపాదించాడు. విలువైన ఆస్తులను కూడబెట్టాడు. అంతే కాదు ఈ బిచ్చగాడి సంపాదన ముందు సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ కూడా దిగదుడుపే అంటే అతగాడి సంపాదన ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అతడే భరత్ జైన్ అనే బిచ్చగాడు. కాదు కాదు బిచ్చగాళ్లలో కోటీశ్వరుడు. నిజానికి కడు పేదరికంతో బాధలు పడేవారు బిచ్చగాళ్లు అవుతారు. కానీ భరత్ జైన్ మాత్రం అదే భిక్షాటనను లాభాలు అందించే వృత్తిగా మార్చుకుని అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇంతకి ఎవరీ భరత్ జైన్ ? బిచ్చాగడు కోటీశ్వరుడు ఎలా అయ్యాడు ? అతడికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ? వాటి విలువెంత ? ఇప్పుడు తెలుసుకుందాం.
భరత్ జైన్ స్వస్థలం ముంబై. అడుక్కుంటూ అత్యంత సంపన్న బిచ్చగాడుగా మారాడు. చిల్లర డబ్బులు పోగేసి రూ. 1.4 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లను కొనుగోలు చేవాడు. అంతే కాదు మిగిలిన డబ్బులను షాపుల్లో పెట్టుబడి పెట్టాడు. ఈ షాపుల ద్వారానే ప్రతి నెల భరత్‌కు రూ. 30వేల వరకు అద్దె వస్తుంది. భారత్ జైన్ నికర విలువ 7.5 కోట్ల డాలర్లు. తాజా లెక్కల ప్రకారం అతని నెల సంపాదన దాదాపు లక్ష రూపాయల వరకు ఉంటుందని అంచనా. 2014 నాటికి భిక్షాటనతో భరత్ సంసాదన ప్రతిరోజూ 2000-2500 రూపాయలు, అంటే ప్రతి నెల ఎంతలేదన్నా 75వేలు వరకు ఆదాయం పొందేవాడంటే అతని ఆదాయాన్ని ఊహించుకోవచ్చు. అందుకే మరి భరత్ ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ బిచ్చగాడు అయ్యాడు.
భరత్ జైన్ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకోలేకపోయాడు. దీంతో బిచ్చగాడుగా మారాడు. భిక్షాటన చేసుకుంటూనే భరత్ పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఇత్తరు పిల్లలు ఉన్నారు. అతని సంపాదనతో వారిద్దరిని బాగా చదివిస్తున్నాడు. భరత్ జైన్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి పరేల్‌లోని డ్యూప్లెక్స్ ఇంట్లో చాలా సౌకర్యవంతంగా ఉంటున్నారు. అతని పిల్లలు కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నారు. ప్రస్తుతం భరత్ ఫుల్ సెటిల్డ్. భిక్షాటన చేయాల్సిన పనే లేదు. కానీ ఎవరు ఎన్ని చెప్పినా కూడా భరత్ అడుక్కోవడం మానడం లేదు.