జాగ్రత్త.. లవ్ లెటర్ రాసినందుకు ఏడాది శిక్ష
X
గర్ల్ ఫ్రెండుకు ప్రేమలేఖ రాసిన ఓ కుర్రాడికి తీట తీరి, ఏడాది శిక్ష పడింది. 15 సంవత్సరాల కిందట రాసిన లేఖ పాపంలా వెంటాడుతూ చాలా ఆలస్యంగా అబ్బాయిని చిక్కుల్లో పడేసింది. అప్పట్నుంచి ఎన్నో వాయిదాలు పడుతూ వస్తున్న ఈ కేసులో కోర్టు ఎట్టకేలకు తీర్పింది. శిక్ష చిన్నదే అయినా పరువు పోయి జీవితమంతా నిలిచిపోయే మచ్చ మిగిలింది.
ఉత్తరప్రదేశ్‌లోని బందాకు చెందిన ఓ టీనేజర్(అప్పట్లో) 2008లో తనకు పరిచయమున్న అమ్మాయికి ఘాటు ప్రేమలేఖ రాశాడు. ‘నువ్వూ నేనూ ఏకమవుదాం, లోకంతో మనకేం పని’ టైపులో ప్రేమ, బూతు అన్నీ రంగరించాడు. అది కాస్తా అమ్మాయి తల్లి చేతుల్లో పడింది. ఆమె న్యాయం కోరుతూ కోర్టుకెక్కింది. ఉత్తరం రాయడమే కాకుండా తన బిడ్డ వీధిలో వెళ్తుంటే ప్రేమా దోమా అంటూ ఏడిపిస్తున్నాడని, కఠినంగా శిక్షించాలని కోరింది. అతడు మైనర్ బాలుడు కావడంతో పోలీసులు చిల్లర కేసు అని పట్టించుకోలేదు. కానీ తల్లి మాత్రం పట్టువదలకుండా పోరాడింది. ఖర్చుకు వెనకాడకుండా కోర్టులో పిటిషన్లు వేసి, పనులు వదిలేసి మరీ కోర్టు చుట్టూ తిరిగింది. కేసులో 80 వాయిదాలు పడ్డాయి. ఎందరో జడ్జీ మారారు. బాలుడు కాస్తా యువకుడు అయ్యాడు. దర్యాప్తు నత్తనడక నడిచింది. లేఖ రాసింది ఎవరో తేల్చడానికే ఏళ్లు పట్టింది. ఇది ఇజ్జత్ కా సవాల్ అని తీసుకున్న కోర్టు అతని ఏడాది పాటు శిక్ష విధించింది. పోలీసుల కనుసన్నల్లో బతుకుతూ ప్రేమలేఖకు దూరంగా ఉండాలని మందలించింది. అంతేకాకుండా మూడు వేల రూపాయల జరిమానా కూడా విధించింది. కేవలం లెటర్ రాసినందుకే ఇంత శిక్షా అని అతడు ఆక్రోశించినా ఫలితం లేకపోయింది. అలాంటి తప్పు ఇక చేయనని ప్రమాణం చేసినా జడ్జి పట్టించుకోలేదు. పదిహేనేళ్లు బుద్ధిగానే ఉన్నావుగా, జస్ట్ ఇంకో ఏడాది నీ ప్రవర్తన బావుందని నిరూపించుకుంటే సరిపోతుందిలే అని ఊరడించి పంపాడు.