ట్రాఫిక్‌లో డెలివరీ లేట్ అవుతుందని డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
X
ఇంట్లో కూర్చుని ఆర్డర్లను బుక్ చేసుకోవడం సులువే. కానీ, ఆ ఆర్డర్లను సమయానికి డెలివరీ చేసేందుకు డెలివరీ బాయ్స్ చాలా కష్టపడుతుంటారు. ఫుడ్ డెలివరీ బాయ్స్ అయితే రోజంతా నగర విధుల్లో తిరుగుతూ ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతూ అలసిపోతుంటారు. అలాంటి కష్టాలే తరచుగా ఎదుర్కొనే ఓ జొమాటో(Zomato)డెలివరీ ఏజెంట్ తన సమస్యకు తానే స్వయంగా పరిష్కారాన్ని కనుగొన్నాడు. వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టి అన్ని ఇబ్బందులకు చెక్ పెట్టాడు.
ఫుడ్‌ను సులువైన పద్ధతుల్లో కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో డ్రోన్‌ను రూపొందించాడు సోహన్ రాయ్ అనే యువకుడు. ఆ డ్రోన్ (Drone)మేకింగ్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు సోహన్. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. అతడి క్రియేటివ్ ఐడియాకు నెటిజన్స్ అభినందనలు తెలుపుతున్నారు. తాను ఎందుకు డ్రోన్‌ను తయారు చేయాల్సి వచ్చిందో ఈ వీడియోలో చలా స్పష్టంగా వివరించాడు. ఓ ఫుడ్ డెలివరీ బాయ్ (Delivery boy)స్వయంగా డ్రోన్ చేయడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
జొమాటో డెలివరీ బాయ్‌గా రోజంతా పనిచేసేవాడు సోహన్ రాయ్ . రోజులో ఎక్కువ సమయం పని చేస్తున్న క్రమంలో నిత్యం ట్రాఫిక్ సమస్య అతడిని వెంటాడింది. ప్రతి ఆర్డర్‌కి గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడం సమస్యగా అనిపించేది. ఎంతో విలువైన సమయం ట్రాఫిక్‌లోనే వృధా అయ్యేది. ఈ కష్టాలన్నింటికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే అతడు డ్రోన్ తయారు చేయాలని డిసైడ్ అయ్యాడు. అందుకు తగ్గట్లుగానే స్వయం కృషితో తన నైపుణ్యాలను ఉపయోగించి అటానమస్ డ్రోన్‌ను తయారు చేశాడు. మరి ఈ డ్రోన్‌ను ప్రయోగాత్మకంగానే పరీక్షించడమే తరువాయి. డ్రోన్ డెలివరీ అనేది కొత్త ఐడియా ఏమీ కాదు. ఎప్పటి నుంచో వింటున్నాం. కానీ, దేశంలో ఇప్పటి వరకు అవి అందుబాటులో లేవన్న విషయాన్ని సోహన్ రాయ్ గుర్తు చేశాడు.