Home > వాతావరణం > దంచికొడుతున్న వాన... రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

దంచికొడుతున్న వాన... రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

హైదరాబాద్‌ అతలాకుతలం

దంచికొడుతున్న వాన... రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు
X


ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వరదలతో వాగులు, వంకలు.. నదులని తలిపిస్తున్నాయి. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. నదులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగం సూచిస్తోంది. ఈరోజు, రేపు భారీ వర్షాలున్నాయన్న సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాల్లో ఏకధాటి వర్షాలకు వాగులు పొంగిపొర్లుతుండగా.. చెరువులు జలకళ సంతరించుకుంటున్నాయి.

ఎడతెరిపిలేని లేని వర్షంతో భాగ్యనగరం తడిసి ముద్దవుతోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో రాత్రి నుండి వర్షం కురుస్తూనే ఉంది. ఈ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నగరంలోని ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో హుస్సేన్‌సాగర్‌ నిండుకుండలా మారింది. జంట జలాశయాలకు ప్రవాహం మొదలైంది. మరోవైపు వర్షసూచనతో బల్దియా యంత్రాంగం అప్రమత్తమైంది. విపత్తు సహాయక బృందాలను రంగంలోకి దించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం, వాయుగుండంగా మారడంతో దానికి అనుబంధంగానే కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఈభారీ వర్షాలతో పాటు పలుచోట్ల గంటకు 40-45కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నట్లుగా ప్రకటించింది. రాబోయే రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికల నేపధ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. చీఫ్ సెక్రట్రీ శాంతి కుమారి అన్నీ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వర్షాలపై తీసుకోవాల్సిన జాగ్రతలపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలోని నదులు, చెరువుల్లో వరదనీరు భారీగా చేరడంతో ముంపు ప్రాంతాలు, వరద ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.


Updated : 27 July 2023 2:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top