Home > వాతావరణం > తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
X

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రెండు మూడు రోజులుగా ముసురు పడుతుండగా.. ఇవాళ్టి నుంచి మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడటంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. నగరాన్ని మూడు రోజులుగా ముసురు వదలడం లేదు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఐదు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

సింగరేణికి 3కోట్ల నష్టం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. వర్షం కారణంగా భూపాలపల్లి సింగరేణి డివిజన్ లోని కాకతీయ ఖని సెక్టార్-2,3 ఓపెన్ కాస్ట్ గనుల్లో గత రెండు రోజులుగా 14 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సింగరేణికి మూడు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

కలెక్టర్లతో సీఎస్ సమీక్ష

భారీ వర్షాల నేపథ్యంలో సీఎస్ శాంతి కుమారి జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలతో ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదురొనేందుకు సిద్ధంగా ఉండేలా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు.

Updated : 19 July 2023 9:57 AM IST
Tags:    
Next Story
Share it
Top