భద్రాచలంలో ఉద్ధృతంగా గోదావరి..మొదట ప్రమాద హెచ్చరిక జారీ
X
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వానలకు గోదావరికి భారీగా వరద కొనసాగుతోంది. గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులు ఉప్పొంగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అలర్ట్‌గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. భారీగా వర్షాలకు రామాలయం పరిసరాల్లో భారీగా వరద నీరు చేరడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు అన్నదాన సత్రం వద్ద వరద నీరు చేరింది.
జిల్లా అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ డా.ప్రియాంక అప్రమత్తం చేస్తున్నారు. 24 గంటలు పనిచేసేలా కలెక్టరేట్‌తో పాటు కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీవో కార్యాలయాలు.. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు.
ఏ ఒక్క ప్రాణానికి హాని కలుగ కుండా ప్రజలకు కానీ పశువులకు కానీ చేపట్టాల్సిన రక్షణ చర్యలపై ఎప్పటి కపుడు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.
మరోవైపు, తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణీ సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. తెలంగాణ, మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత పరుగులు పెడుతోంది.