వానల కోసం మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.. IMD
X
వానల కోసం ఎదురుచూస్తున్న జనాలకు కాస్త నిరాశ కలిగించే వార్త. దేశంలో నైరుతి రుతు పవనాలు.. మరో మూడు నాలుగు రోజులు ఆలస్యంగా కేరళకు చేరవచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా జూన్ ఒకటో తేదీకి రుతుపవనాలు కేరళకు చేరుతాయి. అయితే ఈసారి కాస్త ఆలస్యంగా నాలుగో తేదీకి చేరుతాయని వాతావరణ విభాగం మొదట అంచనా వేసింది. కానీ ఆదివారమే కేరళకు చేరాల్సిన రుతు పవనాలు మరో మూడునాలుగు రోజులు ఆలస్యం కానున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది.
"దక్షిణ అరేబియా సముద్రం మీదుగా పశ్చిమ గాలులు పెరగడంతో పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఆగ్నేయ అరేబియా సముద్రంలో మేఘావర్తనం కూడా పెరుగుతున్నదని" IMD ఒక ప్రకటనలో తెలిపింది. అయితే రుతు పవనాల రాక ఆలస్యమైనా ఖరీఫ్ సీజన్‌తోపాటు దేశవ్యాప్త వర్షపాతంపై ప్రభావం ఉండబోదని అధికారులు చెప్పారు. ఆగ్నేయ రుతుపవనాలు గత ఏడాది మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న, 2019లో జూన్ 8న, 2018లో మే 29న దక్షిణాది రాష్ట్రానికి చేరుకున్నాయి. భారత్‌లోకి భూభాగంపై తొలుత కేరళలో ప్రవేశిస్తాయి. నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి.
అయితే భారత్‌లో ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ అయిన స్కైమెట్ ఏప్రిల్ 10న ప్రకటించింది. కరవు ఏర్పడేందుకు 20శాతం అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఇందుకు కాస్త విరుద్ధంగా.. ఈసారి వర్షాలు సాధారణ స్థాయిలో ఉంటాయని ఐఎండీ తెలిపింది.