Yellow Alert.. రాగల 3 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు
Yellow Alert.. రాగల 3 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు
X
రాగల మూడురోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం దాని పరిసరాలలోని ఒడిస్సా- పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో సగటు సముద్రమట్టానికి 7.6కిలో మీటర్ల వరకు ఆవర్తనం కొనసాగుతున్నదని వెల్లడించింది. ఎత్తుకి వెళ్లే కొద్ది నైరుతి దిశగా కొనసాగుతుందని వివరించింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని కొమురం భీం, మంచిర్యాల,కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రాష్ట్రంలో రాగల ఏడురోజుల పాటు వాతావరణం చల్లగా ఉంటుందని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది.
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ రాత్రి ఒంటి గంట వరకూ భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ పరిధిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ముందుగానే హెచ్చరించడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తం అయ్యింది. డీఆర్‌ఎఫ్ బృందాలు, జీహెచ్‌ఎంసీ అధికారులు వరద సహాయకచర్యల్లో పాల్గొన్నారు