అందుకే లంచాలు తీసుకుంటున్నాం.. నిస్సిగ్గుగా చెప్పిన ప్రభుత్వ అధికారి
X
తన కింది స్థాయి ఉద్యోగులు లంచం తీసుకుంటుంటే మందలించాల్సింది పోయి తానే లంచాలు తీసుకుంటున్నాడు ఓ ప్రభుత్వ ఉన్నాతాధికారి. పైగా తాను లంచాలు తీసుకుంటున్నట్లు బాహాటంగా ప్రకటించాడు. పైగా మంత్రులు, పై అధికారుల పర్యటనలకయ్యే ఖర్చు కోసమే లంచం తీసుకుంటున్నట్లు నిస్సిగ్గుగా చెప్పాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోలో ఉన్న అధికారి శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర తహసీల్దార్ ముర్షావలి అని తెలుస్తోంది. తన కోసం పని మీద వచ్చిన కొందరు వ్యక్తులకు తాను లంచం అడగటానికి గల కారణాన్ని సదరు అధికారి ఆ వీడియోలో వివరించాడు.
మంత్రులు, ఉన్నతాధికారులు వస్తే వాళ్లకు భోజనం, వసతి, ఇతర ఖర్చుల కోసం లక్షల రూపాయలు ఖర్చు అవుతోందని, ఆ ఖర్చును తామే భరించాలని చెప్పాడు. ఈ ఖర్చంతా తన జీతం నుంచో లేక వీఆర్వోల జీతాల నుంచో పెట్టమంటే ఎలా అని ప్రశ్నించాడు. అవన్నీ తాము ఎక్కడి నుంచి తేవాలని, అందుకే లంచాలు అడుగుతున్నామని సమర్థించుకున్నాడు. ఇక మంత్రులు, అధికారులకు వాళ్లకు నచ్చిన మెనూతో భోజనం, టిఫిన్ పెట్టించాలని తన సెల్ ఫోన్ లో ఉన్న మెనూను తన వద్దకు వచ్చిన వ్యక్తులకు చూపించాడు. ఇక వచ్చిన వాళ్లు 'అవును సర్.. మీరు మాత్రం ఖర్చులకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు' అని అనడం కొసమెరుపు.