సీట్ల పంపకంలో ఆ మూడు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం!
X
ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అక్కడి పార్టీలు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకోగా.. వారి కూటమిలోకి బీజేపీ కూడా చేరనుందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారని, ఆ మూడు పార్టీల మధ్య సీట్ల పంపకంలో ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ అగ్రనేత, హోం మంత్రి అమిత్ షా చంద్రబాబు, పవన్ ముందు ఓ ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 4:2:1 నిష్పత్తిలోనే సీట్ల పంపకాలు జరగాలని అమిత్ షా ప్రపోజల్ పెట్టారని వార్తలు వస్తున్నాయి. దాని ప్రకారం మొత్తం 175 స్థానాలకు గాను 100 సీట్లలో టీడీపీ, 50 సీట్లలో జనసేన, 25 సీట్లలో బీజేపీ పోటీ చేయనన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా ఒప్పుకున్నారని టాక్ .
కానీ ఏపీ విభజన చట్టం విషయంలో పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి పెద్దగా చేసిందేమీలేదని, అలాంటప్పుడు అన్ని సీట్లు ఇచ్చి ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఏమైనా నష్టం జరగొచ్చా అనే కోణంలో చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే వైఎస్ షర్మిల ఏపీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని, ఏపీ అభివృద్ధి చెందకపోవడానికి జగన్, చంద్రబాబు కారణమంటూ షర్మిల పదే పదే విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో టీడీపీ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్, చంద్రబాబు, పవన్ ప్రధాని మోడీకి భయపడి ఏపీ భవిష్యత్తును తాకట్టుపెట్టారని షర్మిల నిత్యం విమర్శిస్తున్నారు. దీంతో బీజేపీ మీద ఉన్న కోపం తమ మీదకి ఏమైనా వస్తుందా అనే కోణంలో కూడా వాళ్లు ఆలోచిస్తున్నారని, అయితే ఈసారి కూడా కేంద్రంలో మోడీయే అధికారంలోకి వస్తారనే నమ్మకంతోనే చంద్రబాబు బీజేపీతో పొత్తుకు ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి.