ఏపీ ప్రభుత్వంతో అంగన్ వాడీల చర్చలు విఫలం
X
ఏపీ ప్రభుత్వంతో అంగన్ వాడీలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఇవాళ అంగన్ వాడీ వర్కర్ల ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల చర్చలు జరపారు. అంగన్ వాడీల ఇతర డిమాండ్లను పరిశీలిస్తామన్న ప్రభుత్వ పెద్దలు.. జీతాల పెంపు సాధ్యం కాదని అంగన్ వాడీలకు స్పష్టం చేశారు.ఇటీవలే జీతాలు పెంచామని, మళ్లీ పెంచమంటే ఎలా అని బొత్స వారిని ప్రశ్నించారు. ఇప్పటికే అంగన్ వాడీలకు సంబంధించిన చాలా డిమాండ్లు పరిష్కరించామని తెలిపారు. అంగన్ వాడీలు రేపటి నుంచి విధుల్లో చేరాలని అంగన్ వాడీలను కోరారు. అంగన్ వాడీ వర్కర్లతో సంక్రాంతి తర్వాత మరోసారి చర్చలు జరుపుతామని తెలిపారు. ఇక జీతాలు పెంచకుంటే సమ్మె విరమించేది లేదని అంగన్ వాడీలు తేల్చి చెప్పారు. జీతాలు పెంచేవరకు తమ సమ్మె కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. కాగా జీతాల పెంపు కోసం అంగన్ వాడీ వర్కర్లు 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇంకో కొన్ని నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అంగన్ వాడీల సమ్మె ఏపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.