Jagan : ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్లు.. ఏపీ సీఎం జగన్
X
ప్రజలే తనకు స్టార్ క్యాంపెయినర్లు అని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా నిధుల జమ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రతిపక్షాల కూటమి రాజకీయాలపై విమర్శలు చేశారు. రాష్ట్రానికి ఏనాడు మంచి చేయని చంద్రబాబు కోసం పక్క రాష్ట్రం, పక్క పార్టీల్లోనూ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని అన్నారు. చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్, ఆయన వదినతో పాటు మరో ముగ్గురు మీడియా ఛానల్ అధిపతులు ఉన్నారని అన్నారు. వాళ్లేకాక రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతున్నారని అన్నారు. అలాగే బీజేపీలో కూడా కొంతమంది చంద్రబాబకు కోసం పని చేస్తున్నారని అన్నారు.
అమరావతిలో బాబు భూములకు బినామీలు ఉన్నట్లు మనుషుల్లోనూ, ఇతర పార్టీల్లోనూ.. రకరకాల రూపాల్లోనూ చంద్రబాబుకు బినామీలు ఉన్నారని ఆరోపించారు. వాళ్లంతా ఆయనకు స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారని అన్నారు. కానీ తనకు అలాంటి వాళ్ల అవసరం ఏమాత్రం లేదని అన్నారు. రాష్ట్రంలో తమ పథకాల ద్వారా లబ్దిపొందిన ప్రతి ఒక్కరూ తనకు స్టార్ క్యాంపెయినర్లు అని అన్నారు. ఆసరా నిధులు పొందిన అక్కాచెల్లెలు, ఆడబిడ్డలు తనకు స్టార్ క్యాంపెయినర్లేనని అన్నారు. నెలనెలా పెన్షన్లు అందుకుంటున్న 65 లక్షల మంది తనకు క్యాంపెయినర్లు అని సీఎం జగన్ అన్నారు.