Home > ఆంధ్రప్రదేశ్ > మార్చి 1న ప్రత్యేక హోదాపై డిక్లరేషన్.. Sharmila

మార్చి 1న ప్రత్యేక హోదాపై డిక్లరేషన్.. Sharmila

మార్చి 1న ప్రత్యేక హోదాపై డిక్లరేషన్.. Sharmila
X

మార్చి 1న తిరుపతిలో జరగనున్న కాంగ్రెస్ సభలో ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ ప్రకటించనున్నామని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానమంత్రి హోదాలో ప్రత్యేక హోదాపై మోడీ మాట ఇచ్చిన తిరుపతిలోని అదే మైదానంలో ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ డిక్లరేషన్ ప్రకటించనుందని పేర్కొన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో .. రాష్ట్ర అభివృద్ధికి సైతం అంతే ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. ఆయన అడుగుజాడల్లోనే అనంతపురం సభలో సంక్షేమంపై హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ .. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి హోదాపై కీలక డిక్లరేషన్ చేయబోతుందని షర్మిల తెలిపారు. ప్రత్యేక హోదా అవసరం గురించి రాష్ట్రంలో అందరికీ తెలిసినా ప్రధాన రాజకీయ పార్టీలేవి మాట్లాడవని అన్నారు. టీడీపీ, వైసీపీ గత ఎన్నికలలోప్రత్యేక హోదాను రాజకీయ ప్రచారం కోసం వాడుకుని అధికారంలోకి వచ్చాయని మండిపడ్డారు. కానీ అధికారం చేపట్టాక హోదా గురించి మరిచిపోయాయని అన్నారు. ఏపీకీ అన్యాయం చేసిన మోడీకి బానిసలుగా మారి ఏపీ ప్రజలను తీవ్రంగా మోసం చేస్తున్నారని చంద్రబాబు, జగన్‌లపై విరుచుకుపడ్డారు.

ఈ పదేళ్ల కాలంలో హోదాపై నిజమైన ఉద్యమం చేసిన వారే లేరని షర్మిల అన్నారు. తాజాగా మళ్లీ ఎన్నికల సమీపిస్తుండటంతో ప్రత్యేక హోదాను తెరమీదకు తీసుకొచ్చి డ్రామాలాడుతున్నారని అన్నారు. కానీ వాళ్ల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. 972 కిలో మీటర్ల కోస్టల్ ఏరియా ఉందని, అభివృద్ధి చేయాలనుకుంటే ఎన్నో పరిశ్రమలు స్థాపించవచ్చని అన్నారు. కానీ గత పదేళ్లలో కనీసం పది కొత్త పరిశ్రమలను కూడా తేలేకపోయారని అన్నారు. మెగా డీఎస్సీ అంటూ సీఎం జగన్ దగా డీఎస్సీని వేశారని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో 2 లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కనీసం రెండు మూడు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని అన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ఈ రోజు ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని, కానీ టీడీపీ, వైసీపీ అలా చేయలేదని అన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని ఆదరించాలని షర్మిల కోరారు.

Updated : 28 Feb 2024 1:04 PM GMT
Tags:    
Next Story
Share it
Top