Home > ఆంధ్రప్రదేశ్ > Ap politics : తిరుపతి దొంగ ఓట్ల వ్యవహారంలో పోలీసులపై వేటు

Ap politics : తిరుపతి దొంగ ఓట్ల వ్యవహారంలో పోలీసులపై వేటు

Ap politics : తిరుపతి దొంగ ఓట్ల వ్యవహారంలో పోలీసులపై వేటు
X

తిరుపతి ఉప ఎన్నిక సమయంలో దొంగ ఓట్ల కేసును నీరుగార్చారన్న ఆరోపణలపై పోలీసులపై ఈసీ వేటు వేసింది. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో తిరుపతి సిటీ తూర్పు, పశ్చిమ పోలీస్ స్టేషన్ల సీఐలు, తూర్పు పోలీస్ స్టేషన్ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ గా విధుల్లో ఉన్నవారిపై ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ఈసీ ఆదేశాల మేరకు వీరిని ప్రభుత్వం విధుల నుంచి తప్పించించింది. అదే సమయంలో అలిపిరి సీఐని వేకెంట్ రిజర్వ్ కు బదిలీ చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా, విజయవాడ మెప్మా ఏడీ చంద్రమౌళీశ్వర్ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు పడింది. తాజాగా పోలీసులపైనా ఈసీ చర్యలు తీసుకుంది. 2021లో తిరుపతి ఉప ఎన్నిక జరిగిన సమయంలో తిరుపతి తూర్పు సీఐగా శివప్రసాద్ రెడ్డి, తిరుపతి పశ్చిమ సీఐగా శివప్రసాద్, తిరుపతి తూర్ప ఎస్ఐగా జయస్వాములు, తిరుపతి తూర్పు హెడ్ కానిస్టేబుల్ గా ద్వారకానాథరెడ్డి విధుల్లో ఉన్నారు. దొంగ ఓట్ల కేసులో సాక్ష్యాధారాల్లేవంటూ అప్పటి తిరుపతి పశ్చిమ సీఐ శివప్రసాద్ కేసు మూసివేశారు. సీఐ శివప్రసాద్ ప్రస్తుతం సత్యసాయి జిల్లాలో పనిచేస్తున్నారు. తిరుపతి తూర్పు సీఐ శివప్రసాద్ రెడ్డి ప్రస్తుతం తిరుపతి ఎస్బీలో పనిచేస్తున్నారు. ఈసీ ఆదేశాల నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తిరుపతి పోలీసులను సస్పెండ్ చేస్తూ నేడు డీఐజీ అమ్మిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

దీంతో పోలీసు డిపార్ట్ మెంట్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు నడుచుకున్నామని, తమ తప్పేంలేదని సదరు పోలీసులు డీఐజీకి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారని, అయితే అవేమీ ఆయన పట్టించుకోలేదని తెలిసింది. ఈసీ నిర్ణయాలను అమలు చేయడం తన బాధ్యత అని అన్నట్లు తెలుస్తోంది. కాగా తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల సందర్భంగా వేల సంఖ్యలో దొంగ ఓట్ల నమోదు అయ్యాయంటూ ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. ఇటీవల ఈ ఇద్దరు నేతలు బీజేపీ పెద్దలతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులపై ఈసీ చర్యలు తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావు లేదని, అంతా ఈసీ నిబంధనల ప్రకారమే జరిగిందని అధికారులు చెబుతున్నారు.




Updated : 11 Feb 2024 11:42 AM GMT
Tags:    
Next Story
Share it
Top