Chegondi Harirama Jogaiah : కనీసం 50 సీట్లైనా తీసుకో.. జనసేనానికి హరిరామ జోగయ్య సూచన
X
ఏపీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ గెలుపు కోసం స్ట్రాటజీలు రచిస్తున్నాయి. జగన్ ప్రభుత్వాన్ని దించేందుకు టీడీపీ-జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఆ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకంలో చర్చలు జరుగుతున్నాయి. మొత్తం 175 సీట్లలో జనసేనకు 30 సీట్ల వరకు పొత్తులో భాగంగా టీడీపీ ఇవ్వనున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామ జోగయ్య పవన్ కల్యాణ్ కు లేఖ రాశారు. పొత్తులో భాగంగా కనీసం 50 సీట్లైనా తీసుకోవాలని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు సూచించారు. చంద్రబాబు కోసం కాపులు పవన్ వెంట నడవడం లేదని.. దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడుతారని అన్నారు. రెండున్నరేళ్లు పవన్ సీఎంగా ఉంటారనే మాట చంద్రబాబుతో చెప్పించి తీరాలని లేఖలో హరిరామయ్య జోగయ్య డిమాండ్ చేశారు.
వైసీపీని రాజ్యాధికారం నుంచి తప్పించడం అంటే టీడీపీకి రాజ్యాధికారం కట్టబెట్టడం కాదని, అసలు కాపు సామాజిక వర్గం పవన్ కల్యాణ్ తో కలిసి ప్రయాణం చేస్తుంది ఈ ఆలోచనతో కాదనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. జనసేన సపోర్టు లేకుండా టీడీపీ అధికారంలోకి రావడం కష్టమని, అందుకే 2019 ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని పేర్కొన్నారు. అధికారం అంతా చంద్రబాబుకు ధారపోస్తే మీరు కలలు కంటున్న రాష్ట్ర ప్రయోజనాలను ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. సీట్ల పంపకంలో కొంత తేడా ఉన్నప్పటికీ సీఎం పదవిలో రెండున్నరేళ్లు పవన్ కు ఛాన్స్ ఇస్తారా అని చంద్రబాబును జోగయ్య ప్రశ్నించారు. అట్లా అయితేనే కాపులు పవన్ కల్యాణ్ వెంట ఉంటారని అన్నారు.