Home > ఆంధ్రప్రదేశ్ > Jana Sena Nagababu : మెగా డీఎస్సీ పేరిట వైసీపీ దగా.. జనసేన నేత నాగబాబు

Jana Sena Nagababu : మెగా డీఎస్సీ పేరిట వైసీపీ దగా.. జనసేన నేత నాగబాబు

Jana Sena Nagababu : మెగా డీఎస్సీ పేరిట వైసీపీ దగా.. జనసేన నేత నాగబాబు
X

మెగా డీఎస్సీ పేరిట వైసీపీ సర్కార్ యువతను నిలువునా మోసం చేసిందని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. రాష్ట్రంలో 25 వేల నుంచి 30 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే... కేవలం 6100 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పడం దారుణమన్నారు. సోమవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన డీఎస్సీ అభ్యర్థులతో నాగబాబు మాట్లాడారు. గత పదేళ్లుగా వైసీపీ చేసిన మోసాన్ని ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులు నాగబాబుకి వివరించారు. తమ సమస్యలపై వినతిపత్రాన్నిఅందజేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. ఎన్నికల వేళ మరోసారి నిరుద్యోగులను మోసం చేయడానికి ఈ నోటిఫికేషన్ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా నిరుద్యోగులపై జగన్ సర్కార్ కు ప్రేమ ఉంటే ఖాళీగా ఉన్న 30 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పాద యాత్రలో, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాదయాత్ర సమయంలో 23వేల పోస్టులతో మెగా డీఎస్సీ ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు.



దీంతో తమ జీవితాలు మారిపోతాయని లక్షలాది మంది నిరుద్యోగులు వైసీపీకి ఓట్లు వేసి గెలిపించారని, కానీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరేళ్లు దాటుతున్నా ఇప్పటి వరకు ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయిందని మండిపడ్డారు. రోజు రోజుకు నిరుద్యోగుల్లో అగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయని అన్నారు. ఒక వైపు తల్లిదండ్రులకు భారమవుతున్నామనే బాధ... మరో వైపు వయోపరిమితి పెరిగిపోతుందనే ఆందోళన వారిలో కనబడుతోందని అన్నారు. కొంతమంది పొట్టకూటి కోసం దీనిసరి కూలీలుగా పని చేస్తున్నామని చెప్పడం బాధ కలిగించిందన్న నాగబాబు.. తల్లిదండ్రులకు భారం కాకూడదని నిరుద్యోగులు కూలీ పనులకు వెళ్లడం దురదృష్టకరమని అన్నారు.





రాష్ట్రంలో టెట్ క్వాలిఫై అయినవారు దాదాపు 10 లక్షల మంది వరకు ఉన్నారని, వారందరూ డీఎస్సీ రాయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. వారిలో 30వేల మందికి ఉద్యోగాలు వస్తే దాదాపు 30వేల కుటుంబాలు బాగుపడినట్లేనని అన్నారు. ప్రభుత్వం ఇటీవల 6100 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసిందని, ఆ నోటిఫికేషన్ లో ఎస్.జి.టి. పోస్టులు 1725 మాత్రమే ఉన్నాయని, అందులో ఒక్క కర్నూలు జిల్లాలోనే 1646 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు. మిగతా జిల్లాల్లో అభ్యర్ధుల పరిస్థిత ఏంటని ప్రశ్నించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా జనసేన-తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, డీఎస్సీ అభ్యర్ధులకు న్యాయం జరుగుతుందని నాగబాబు అన్నారు. ఇక జీవో నెంబర్ 117 రద్దు చేయాలని డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేశారు.




Updated : 5 Feb 2024 11:23 AM GMT
Tags:    
Next Story
Share it
Top