బటన్ నొక్కడం తప్ప జగన్ చేసిందేమీ లేదు.. జనసేన సెటైర్లు
X
వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా బటన్లు నొక్కడం మినహా రాష్ట్రానికి ప్రజలకు చేసింది శూన్యమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలో ఒక్క అభివృద్ధి కార్యక్రమమూ చేయలేదన్నారు. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవని, ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేని వైసీపీని ఇంటికి పంపించాలి అన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరం పని చేయాలని కోరారు. గురువారం తెనాలి మండల కమిటీలో పలువురికి నియామక పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ .. ఎన్నికలకు 60 రోజులు మాత్రమే సమయం ఉందని, ప్రతి క్రియాశీలక సభ్యుడు, నాయకుడు ఎవరి గ్రామాల మీద వారు దృష్టి సారించాలని అన్నారు. "ప్రతి గ్రామంలో సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రహదారులు దారుణంగా ఉన్నాయి. గుంతలు, కూడా పూడ్చే దిక్కు లేదు. రోజుకి ఒకరిద్దరు ప్రమాదాల్లో మరణించే పరిస్థితి. సంక్షేమం ముసుగులో అభివృద్ధిని ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. రహదారులు పెద్ద సమస్య కాదు అని స్థానిక ఎమ్మెల్యే చెబుతున్నారు. చిన్న సమస్య అయితే ఎందుకు ఒక్క రోడ్డు వేయలేకపోయారో ప్రజలకు చెప్పాలి. గ్రామ స్థాయిలో సమస్యలు పేరుకుపోయాయి. కాలువలు సరిగా లేవు. రోడ్లు లేవు. రైతులు రైతు కూలీలుగా మారిపోయిన పరిస్థితి, ఫించను తీసేశారు" అని తెలిపారు.
రేషన్ కార్డుల్లో అవకతవకలు, ఉపాధి హామీ పథకం పనులు లేవు, కౌలు రైతులు ప్రభుత్వాలు పట్టించుకోక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొందని అన్నారు. కనీసం మనిషి చనిపోతే ప్రభుత్వం నుంచి భరోసా ఇవ్వలేని పరిస్థితి ఉందని అన్నారు. క్రియాశీలక సభ్యులకు జనసేన రూ.5 లక్షలు ఇస్తుంటే., జగన్ కనీసం లక్ష కూడా ఇవ్వలేకపోతున్నారని అన్నారు. ప్రభుత్వంలో ఉన్న బీమా పథకం కింద కేంద్రం, రాష్ట్రం కలిపి రూ.2 లక్షలు ఆర్ధిక సాయం చేయాలని అన్నారు. ఈ ప్రభుత్వం చేయడం లేదన్న ఆయన.. ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని అన్నారు. క్రియాశీలక సభ్యులు పార్టీ సిద్ధాంతాలు, ప్రణాళికలు ప్రజలకు వివరించాలని వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించబోతున్నామని తెలిపారు. జనసేన-టీడీపీ ప్రభుత్వం నూటికి నూరుపాళ్లు స్థాపించబోతున్నామని తెలిపారు.