Chandrababu : చంద్రబాబు 'మహా స్వాప్నికుడు' పుస్తకావిష్కరణ
X
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై సీనియర్ జర్నలిస్ట్ పూల విక్రమ్ రచించిన 'మహా స్వాప్నికుడు' పుస్తకాన్ని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ గోపాలగౌడ ఆవిష్కరించారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు జనార్దన్, నెట్టెం రఘురామ్, నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ పుస్తకంలో చంద్రబాబు వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన పలు అంశాలను రచయిత పొందుపరిచారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కృషి, పట్టుదల, నిరంతర శ్రమే ఆయుధాలుగా చంద్రబాబు అంచెలంచెలుగా ఎదిగిన క్రమాన్ని వివరించారు. తన దార్శనికతతో రాష్ట్రానికి దశ, దిశ నిర్దేశించిన చంద్రబాబు గురించి రాశారు. చంద్రబాబు బాల్యం, విద్యాభ్యాసంతో ప్రారంభించి ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల వరకు అనేక అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.
జగన్ ప్రభుత్వం చంద్రబాబుపై పెట్టిన కేసుల్ని దీటుగా ఎదుర్కోవడం, 53 రోజులపాటు జైల్లో పెట్టినా మొక్కవోని దీక్షతో ఆయన సాగిస్తున్న అలుపెరగని పోరాటం వరకు అన్ని అంశాల్నీ పుస్తకంలో పొందుపరిచారు.ఇక రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కోలేక ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు రాజకీయ ప్రత్యర్థులు ఎలా దుష్ప్రచారాలు చేశారో అనే అంశాలను జోడించారు. దీనిపై ఒక అధ్యాయమే ఉంది. రెండు ఎకరాల ఆస్తి మాత్రమే ఉన్న చంద్రబాబు ఎలా కోట్లు సంపాదించారంటూ రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబును టార్గెట్ చేసిన విషయాలను రచయిత పొందుపరిచారు.