షర్మిల సమక్షంలో కాంగ్రెస్లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే
X
వైఎస్ షర్మిల ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. కాగా విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆమె పీసీసీ అధ్యక్షురాలిగా పగ్గాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో ఆర్కే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్కేకు కాంగ్రెస్ కండువా కప్పిన షర్మిల ఆయనకు పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. పార్టీలోకి వచ్చినవాళ్లకు సముచిత గౌరవం కల్పిస్తామని అన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీ బలం చేకూరిందని అన్నారు.
ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని షర్మిల స్పష్టం చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గత కొంతకాలంగా వైసీపీపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. తాను షర్మిలతో పాటే రాజకీయ ప్రయాణం సాగిస్తానని, ఆమె ఏ పార్టీలోకి వెళితే తాను కూడా ఆ పార్టీలోకి వెళతానని కొన్నిరోజుల కిందటే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన ఈ రోజు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.