రేపు ఏపీలో ప్రధాని మోడీ పర్యటన
X
ప్రధాని నరేంద్ర మోడీ రేపు (మంగళవారం) ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం లేపాక్షి దుర్గాతో పాటు పాపనాశేశ్వర , వీరభద్ర స్వామి ఆలయాలను సందర్శించనున్నారు. ఇక ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా ప్రధాని కార్యాలయ భద్రతాదికారులు , రాష్ట్ర పోలీసులు, అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా ప్రధాని ఈ పర్యటనలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని సుమారు రూ.541 కోట్ల వ్యయంతో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ(నాసిన్)ను ప్రధాని ప్రారంభించనున్నారు.
కాగా ఈ నెల 22న అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఆయన ఏపీకి రానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మోడీ పర్యటనపై తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే మోడీ పర్యటన పూర్తిగా అధికారిక పర్యటన అని, రాజకీయాలకు ఎలాంటి తావు లేదని పీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి.