చంద్రబాబు, జగన్ బీజేపీతో డ్యూయెట్ పాడుతున్నారు.. షర్మిల సెటైర్
X
ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబుపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. బాబు, జగన్ బీజేపీతో డ్యూయెట్ పాడుతూ ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తునిలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నపుడు తాండవ నదికి రిటైనింగ్ వాల్ కడతానని హామీ ఇచ్చారని అన్నారు. అయితే ఆయన అకాల మరణంతో అది ఆగిపోయిందని అన్నారు. ఆయన చనిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రిటైనింగ్ వాల్ కట్టలేదని అన్నారు. అలాగే చంద్రబాబు తర్వాత అధికారం చేపట్టిన జగన్ కూడా రిటైనింగ్ వాల్ ని నిర్మించలేదని అన్నారు. స్థానికంగా ఉన్న దివిస్ పరిశ్రమను బంగాళాఖాతంలో కలుపుతానని జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమాలు చేశారని, కానీ అధికారంలోకి వచ్చాక ఆ పరిశ్రమకు దగ్గరుండి ఆయనే అనుమతి ఇచ్చారని మండిపడ్డారు. మాట మీద నిలబడటం అంటే ఇదేనా అని షర్మిల ఫైర్ అయ్యారు.
రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, పైగా రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్రంతో అంటకాగుతున్నారని అన్నారు. బీజేపీకి వంగి వంగి దండాలు పెడుతూ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు. విభజన చట్టంలో చెప్పిన ఏ ఒక్క హామీ అమలు కోసం ఆ రెండు పార్టీల నాయకులు ప్రయత్నించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప ఏపీకి న్యాయం జరగదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని షర్మిల కోరారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.