ముగిసిన లోకేశ్ పాదయాత్ర
X
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగిసింది. సోమవారం నాడు గాజువాక నియోజకవర్గం జీవీఎంసీ వడ్లమూడి జంక్షన్ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. లోకేశ్ తో పాటు ఆయన తల్లి భువనేశ్వరి, అత్త నందమూరి వసుంధరాదేవి, ఇతర కుటుంబ సభ్యులు కలసి ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. లోకేశ్ కి సంఘీభావంగా వేలాదిమంది కార్యకర్తలు, ప్రజలు కలిసి నడిచారు. ఇక చివరి రోజైన తన పాదయాత్రలో శివాజీనగర్ వద్ద లోకేశ్ పైలాన్‌ను ఆవిష్కరించారు. ఇక లోకేశ్ పాదయాత్రతో గాజువాక ప్రధాన రహదారి జనసంద్రంగా మారింది. యాత్ర ముగింపుకు ఏపీ నలుమూలల నుంచి పెద్దఎత్తున టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గాజువాకకు తరలివచ్చారు.
2 కిలో మీటర్ల మేర భారీ ర్యాలీ కారణంగా గాజువాక ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఇక లోకేశ్ తన యాత్రలో భాగంగా మొత్తం 226 రోజులు పాదయాత్ర చేశారు. అందులో భాగంగా ఏపీ వ్యాప్తంగా 3,132 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ హయాంలో ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. జగన్ పాలన అంతమొందితే తప్ప రాష్ట్ర ప్రజలకు మేలు జరగదని అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీకి తాను కట్టుబడి ఉంటానని అన్నారు. రాష్ట్రంలో వచ్చేది టీడీపీయేనని, తమ ప్రభుత్వం రాగానే జగన్ తప్పులన్నింటినీ సరిదిద్దుతామని అన్నారు. తనకు యాత్రకు సహకరించిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు.