Home > ఆంధ్రప్రదేశ్ > టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం

టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం

టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం
X

టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ ఇవాళ సమావేశమైంది. ఈ సమావేశానికి టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, తంగిరాల సౌమ్య హాజరు కాగా జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కందులు దుర్గేశ్, బొమ్మిడి నాయకర్, గోవిందరావు, పాలవలస యశస్వి, మహేందర్ రెడ్డి హాజరైనట్లు తెలుస్తోంది. ఈ సందర్బంగా ఎన్నికల ప్రచారంలో ఫోకస్ చేయాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, ఎన్నికల ప్రచారంపై ఇరు పార్టీల నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఏ ఏ హామీలను మేనిఫెస్టోలో చేరిస్తే ఓట్లు సాధించవచ్చనే చర్చ నడిచినట్లు సమాచారం. అలాగే ఈ సమావేశంలో డ్వాక్రా రుణమాఫీ హామీపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. డ్వాక్రా రుణాలు మాఫీ చేయడం సాధ్యమా కాదా? మహిళలను ఆకట్టుకునేందుకు ఇంకా ఏమైనా పథకాలు తీసుకురావాలా అనే కోణంలో కూడా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

అలాగే త్వరలోనే రెండు పార్టీలకు సంబంధించి ఉమ్మడి బహిరంగ సభను పెట్టాలని, పెడితే ఎక్కడ పెట్టాలనే అంశంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖరారు అయినప్పటికీ అక్కడక్కడ ఈ రెండు పార్టీల నేతల మధ్య సమన్వయ లోపం ఉందని, ఆ గ్యాప్ ను ఎలా పూడ్చాలనే అంశంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే

వాలంటీర్ల వ్యవస్థ కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న ఆలోచనలో టీడీపీ, జనసేన ఉన్న నేపథ్యంలో దానిపై కూడా చర్చించినట్లు సమాచారం. వాలంటీర్లను బూత్ ఏజెంట్లుగా నియమించాలన్న మంత్రి ధర్మాన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది.

వాలంటీర్ల గురించి మంత్రి ధర్మాన ఏమన్నారంటే?

రానున్న ఎన్నికల్లో అవసరమైతే గ్రామ వాలంటీర్లే బూత్ ఏజెంట్లుగా పని చేయాల్సి వస్తుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ తరఫున వాలంటీర్లే బూత్ ఏజెంట్లుగా కూర్చోవాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపారు. 80 ఏళ్లు దాటిన వృద్ధులకు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ ఇస్తున్నందున ఈ ఎన్నికల్లో వాలంటీర్లు కీలకపాత్ర వహించాల్సి ఉంటుందని అన్నారు. బూత్ ఏజెంట్లుగా కూర్చునేందుకు వాలంటీర్లకు ఎలాంటి అడ్డంకి ఉండదని ధర్మాన పేర్కొన్నారు. వాలంటీర్లకు సర్వీస్ రూల్స్ ఉండవని.. ఎవరికి ఓటు వేయాలో మీరు చెప్పకపోతే ఎవరు చెబుతారని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలులో ఏర్పాటుచేసిన గ్రామ/వార్డు వాలంటీర్ల పురస్కారాల ప్రదానోత్సవంలో ధర్మాన ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా మంత్రి ధర్మాన చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఏపీలో వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ స్పష్టం చేసిన నేపథ్యంలో వాలంటీర్లను బూత్ ఏజంట్లుగా నియమించాలని ఎలా అంటారని టీడీపీ, జనసేన నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో ఈ అంశంపై మరింత ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

Updated : 22 Feb 2024 10:22 AM GMT
Tags:    
Next Story
Share it
Top