కీలక బాధ్యతలు చేపట్టిన వేళ.. షర్మిల రియాక్షన్ ఇదే
X
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియామకం అయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తన నియామకం పట్ల షర్మిల సంతోషం వ్యక్తం చేశారు. తనపై విశ్వాసం ఉంచినందుకు ఏఐసీసీ చీఫ్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ లకు షర్మిల ధన్యవాదాలు తెలిపారు. ఇక తన నియామకంలో సహకరించిన ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ కు కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఆయనతో కలిసి పని చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. అలాగే పార్టీ ఏపీ తాజా మాజీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు, ఏపీలోని పార్టీ ముఖ్య నేతల సహకారంతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి అహర్నిషలు పని చేస్తానని షర్మిల అన్నారు.
కాగా వైఎస్ఆర్టీపీ చీఫ్ గా ఉన్న షర్మిల ఇటీవల తన పార్టీని ఏఐసీసీ చీఫ్ ఖర్గే, పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అదే రోజు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పజెప్పినా మనస్ఫూర్తిగా చేస్తానని షర్మిల ప్రకటించారు. అయితే ఆమెను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమించనున్నారని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఇవాళ షర్మిలకు కీలక బాధ్యతలు అప్పజెప్పారు.